భగవద్గీతని సూర్య చంద్రులని ఎవరో గుర్తించాలా?

UNESCO Recognization For Bhagavad Gita

భగవద్గీత, భరతముని రచించిన నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించిందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలకు తెలియజేశారు. వాటికి యునెస్కో గుర్తింపు లభించడం వెనుక కేంద్ర ప్రభుత్వం లేదా కొన్ని సంస్థలు, కొందరు ఉన్నత వ్యక్తుల కృషి ఉండి ఉండవచ్చు. కనుక వారందరినీ అభినందించాల్సిందే.

కానీ భగవద్గీతకు గుర్తింపు లభించిందని చెప్పడం ఎలా ఉందంటే సూర్య చంద్రులకి గుర్తింపు లభించిందని చెపుతున్నట్లే ఉంది.

ADVERTISEMENT

అనేక యుగాల క్రితమే మనుషులు ఏవిదంగా నడుచుకోవాలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మానవులకు తెలియజేశాడు. అప్పటి నుంచి అనేక యుగాలు, వేలతరాలు మారినా భగవద్గీత అలాగే మానవులతో పాటు పయనిస్తూ మార్గదర్శనం చేస్తూనే ఉంది.

సూర్య చంద్రులకైనా గ్రహణం పట్టి కనబడకుండా పోవచ్చు కానీ భగవద్గీత మాత్రం యధాతధంగా అలాగే నిలిచి ఉంది.

మానవ జీవితసారం, జీవన విధానం గురించి అంత అద్భుతంగా వివరించిన భగవద్గీతకి యునెస్కో గుర్తింపు లభించిందా లేదా ముఖ్యం కాడు.. ఇన్ని కోట్ల మంది హిందువులలో ఎంత మంది భగవద్గీత ఒక్కసారైనా చదివారు?అంటే సమాధానం లభించదు.

రామాయణ, మహాభారత, భాగవత, భగవద్గీతలో ఏమి చెప్పాయో తెలుసుకోకుండానే వాటిని విమర్శించే హిందువులు కోకొల్లలున్నారు. అలా విమర్శించడమే హేతువాదం, లౌకికవాదం అనుకునే కుహానా మేధావులు కోకొల్లలున్నారు. హిందూ మతం, దానిలో వీటన్నిటి గొప్పదనాన్ని గుర్తించలేక వేరే మతాలలోకి మారుతున్న వారు కోకొల్లలున్నారు.

కానీ ఇటువంటి పరిస్థితులలో కూడా భగవద్గీత తన ఔనత్యం కోల్పోలేదు. చేదుకున్న వారికి చేదుకున్నంత మహాదేవా అన్నట్లు యుగయుగాలుగా, తరతరాలుగా మానవులకు జ్ఞానం అందిస్తూనే ఉంది. ప్రతీ వ్యక్తికీ ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తుంటుంది. కొత్త అర్ధాలు చెపుతూనే ఉంటుంది.

భగవద్గీత అంటే ఎవరైనా చనిపోయినప్పుడు పెట్టే ఘంటశాల శ్లోకాలు కావు. ప్రతీ మనిషి చనిపోకముందే చదివి ఆకళింపు జేసుకోవలసిన గొప్ప జీవన విధానం.

ఇటువంటి గొప్ప గ్రంధానికి గుర్తించడానికే యునెస్కోకు ఇన్ని దశాబ్ధాలు పట్టింది. యునెస్కో గుర్తించడం కంటే ప్రతీ భారతీయుడు జీవితంలో ఒక్కసారైనా భగవద్గీతని చదివి ఆకళింపు చేసుకోవడమే చాలా ముఖ్యం. మన భగవద్గీతని మనం తెలుసుకోకుండా యునెస్కో గుర్తించిందని గొప్పగా చెప్పుకొని ఏం ప్రయోజనం?

ADVERTISEMENT
Latest Stories