ఎక్కడో అమెరికాలో ఆర్థిక సంక్షోభం వస్తే ఇక్కడ ముంబై స్టాక్ మార్కెట్ మీద ప్రభావం పడినట్టు పవన్ కళ్యాణ్ హీరో కావడం వల్ల తన సినిమాలకు రాజకీయ వేడి విపరీతంగా తగులుతోంది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ విడుదల సమయంలో అధికార వైసిపి పార్టీ చేసిన హడావిడి ఫ్యాన్స్ ఇప్పట్లో మర్చిపోరు. థియేటర్ల దగ్గర రెవిన్యూ సిబ్బంది కాపలా కాయడం ఈ తరం ఎప్పుడూ చూడని వింత.
ఇంకో 17 రోజుల్లో బ్రో విడుదల కానుంది. కారణాలు ఏమైనా పవర్ స్టార్ మూవీకి ఉండాల్సినంత హైప్ దీని విషయంలో కనిపించడం లేదు. వారాహి యాత్రకు వచ్చిన అనూహ్య స్పందన జనసేన శ్రేణుల్లో విపరీతమైన ఉత్సాహం తెచ్చింది. అధిక సందర్భాల్లో ఆవేశం మోతాదుకి మించి ప్రదర్శించే పవన్ ఈసారి చాలా సెటిల్డ్ గా అధికార పార్టీని నిలదీస్తున్న తీరు యూత్ కి బాగా చేరింది.
ఈ నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు, ఇకపై జగన్ మోహన్ రెడ్డిని ఏకవచనంతోనే సంబోధిస్తానని అన్న మాటలు పొలిటికల్ హీట్ ని పెంచేశాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు మాటల దాడి పెంచారు. ఈ నేపథ్యంలో వైసిపి సర్కారు కన్ను సహజంగానే బ్రో మీద పడుతుంది. జూలై 28 రిలీజ్ పెట్టుకున్న ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలు ఈమధ్యే ఊపందుకున్నాయి.
ఇంతకు ముందు చేసినట్టే బెనిఫిట్ షో అనుమతులు రద్దు చేయడం, టికెట్ రేట్లను కఠినంగా అమలు చేయడం లాంటి అనూహ్య చర్యలు ఉండొచ్చని ఎగ్జిబిటర్లు ఒక కంక్లూజన్ కు వచ్చేశారట. అందుకే మొత్తం డబ్బు చెల్లించడం, మినిమం గ్యారంటీ కింద ఒప్పందాలు చేసుకోవడం లాంటివి కాకుండా రికవరీ అయ్యే విధంగా కనిష్ట అడ్వాన్స్ పద్ధతికే వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
ఒకవేళ ఫలితంలో కానీ, కలెక్షన్లలో కానీ ఏదైనా తేడా వస్తే ఆ భారం అధిక శాతం నిర్మాత మీద పడుతుంది. దీని వల్ల నష్టాలు తప్పించుకోవచ్చు. పవన్ మీద వైసిపి ప్రభుత్వం గుర్రుగా ఉన్న తరుణంలో రిస్క్ చేయడం ఎందుకనే ఆలోచనతో తాము చెప్పిన విధంగా అయితేనే విడుదలకు సహకరిస్తామని ప్రొడ్యూసర్లకు తెగేసి చెప్పినట్టు అంతర్గతంగా వినిపిస్తున్న మాట.
రాబోయే రోజుల్లో పరిణామాలు డ్రామాను తలపించే స్థాయిలో ఉన్నాయి. బ్రో వాయిదాకు ఛాన్స్ లేదు కాబట్టి చావో రేవో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ధైర్యం చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆదిపురుష్ తెచ్చిన నష్టాలు బ్రోతో రికవరీ అవుతాయని ఆశించిన సంస్థకు ఇదంతా శరాఘాతమే. టాక్ ఎక్స్ ట్రాడినరీగా వస్తే హమ్మయ్య అనుకోవచ్చు. కానీ తమిళ దర్శకుడు తీసిన రీమేక్ తో అది జరిగితే అద్భుతమే.



