Unstoppable-with-NBK-Season-2_Nandamuri-Balakrishna-Nara-Chandrababu-Naiduఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రసారం కాబోతున్న అన్‌స్టాపబుల్-2 టాక్ షోకి మొట్ట మొదట టిడిపి అధినేత తన బావ చంద్రబాబు నాయుడుని, తన అల్లుడు నారా లోకేష్‌ని రప్పించి, బాలయ్య వారిని కొన్ని సీరియస్ ప్రశ్నలు కొన్ని కొంటె ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.

దానిలో ఓ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు తనకు ఆప్తమిత్రుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పడం, 1995లో ఎన్టీఆర్ చేతిలో నుంచి టిడిపి పగ్గాలు తీసుకోవడం వంటి అంశాలు అన్‌స్టాపబుల్-2ప్రమోలో చూపించారు. కనుక వైసీపీ నేతలకు మళ్ళీ నోటికి పని కల్పించినట్లయింది.

Also Read – ఎగ్జిట్ పోల్స్: వైసీపి అంచనాలే నిజం కానున్నాయా?

ముందుగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, “ఎన్టీఆర్‌కు పార్టీ నడపడం చేతకాదని చంద్రబాబు నాయుడు భావిస్తే పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కానీ ఆయన చేతుల్లో నుంచి పార్టీని గుంజుకోవడం ఏమిటి?” అని ప్రశ్నించారు. ‘బాలకృష్ణ తన తండ్రి చావుకి కారణం అయిన చంద్రబాబు నాయుడుతో కలిసి నేటికీ అబద్దాలు ప్రచారం చేయడానికి ఈ వేదికను దుర్వినియోగపరుస్తున్నాడని’ కొడాలి నాని ఆరోపించారు.

అన్‌స్టాపబుల్-2 మొట్ట మొదటి షోకి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను ఆహ్వానించినప్పుడే వైసీపీలో కలకలం మొదలైంది. వారు ముగ్గురూ కలిసి ఏమి బాంబు ప్రేలుస్తారో అని ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రమోలో తమకు సులువుగా మాట్లాడగల ఈ అంశాన్ని తీసుకొని కొడాలి నాని మాట్లాడారని అర్దమవుతోంది. లేకుంటే వైఎస్సార్-చంద్రబాబు స్నేహం గురించి మాట్లాడి ఉందేవారు కదా?

Also Read – కేసులు కావు… లంకె బిందెలవి!

బాలకృష్ణ, చంద్రబాబు వద్దనుకొంటే ఈ షోలో అసలు ఈ ప్రస్తావన చేసేవారే కారు. కానీ ఆనాడు జరిగిన వాస్తవం ఏమిటో ప్రజలకు కూడా తెలియజేయాలనే బాలకృష్ణ ఈ ప్రశ్న అడగగా, ఎన్నో ఏళ్ళుగా ఈ అపవాదుతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబు నాయుడు కూడా ధైర్యంగా అసలు విషయం బయటపెట్టారని ప్రమో చూస్తే అర్దమవుతుంది.

ఒకవేళ ఎన్టీఆర్‌ టిడిపిని సరిగ్గా నడపలేకపోతున్నారని భావిస్తే చంద్రబాబు నాయుడు బయటకు వెళ్ళిపోవాలి కానీ ఎన్టీఆర్ చేతిలో నుంచి పా ర్టీ పగ్గాలు తీసుకోవడం ఏమిటి?అని కొడాలి వారికి మంచి సందేహమే వ్యక్తం చేశారు.

Also Read – గులకరాయి కేసు… జగన్ ను ఏ విధంగా నిలబెడుతుందో..?

నిజమే! ఆనాడు ఎన్టీఆర్‌ ఎంతో శ్రమించి టిడిపిని స్థాపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బలంగా నిలబెట్టారు. అంతకాలం రాజ్యాధికారానికి దూరమైన రాష్ట్రంలోని బడుగు బలహీనవర్గాల ప్రజలకు కూడా టిడిపితో అవకాశం కల్పించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా టిడిపిని నిలిపారు. జాతీయస్థాయిలో సైతం టిడిపికి, రాష్ట్రానికి ఓ ప్రత్యేక గుర్తింపు, గౌరవం కల్పించారు.

అటువంటి గొప్ప పార్టీని ఎన్టీఆర్‌ను అడ్డుపెట్టుకొని లక్ష్మీ పార్వతి చేతిలోకి తీసుకోబోతుంటే, ఆయన కుటుంబ సభ్యులే కాదు టిడిపిలో అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎలాగైనా టిడిపిని కాపాడుకోవాలనే పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేల ఒత్తిడి చేసినందునే చంద్రబాబు నాయుడు అయిష్టంగా మావగారైన ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసి టిడిపి పగ్గాలను చేతిలోకి తీసుకొన్నారు.

ఆనాడు తాను ఆవిదంగా చేసి ఉండకపోతే నేడు టిడిపి మిగిలి ఉండేది కాదేమో? అని చంద్రబాబు నాయుడే అన్నారు. పార్టీ అంటే దాని కార్యాలయమో… పెత్తనమో కాదు. పార్టీలో ఉండే లక్షలాది మంది కార్యకర్తలు, నేతలు, ప్రజా ప్రతినిధులు, పార్టీపై ప్రజల నమ్మకం ఇంకా చాలానే ఉంటాయని అందరికీ తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు ఆనాడు ఆ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.

ఈవిషయం నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీలో ముఖ్య నేతలందరికీ బాగా తెలుసు. అందుకే నేటికీ ఎవరూ చంద్రబాబు నాయుడుని వేలెత్తి చూపడం లేదు. టిడిపిని కబళించాలని ప్రయత్నించి భంగపడిన లక్ష్మీ పార్వతి, తన ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు విఫలం చేసినందుకు నాటి నుంచి ఆయనపై భగభగమండిపడుతూ ఆక్రోశిస్తూ ఉండటం అందరూ ఉన్నారు.

ఒకవేళ చంద్రబాబు నాయుడు చేసింది ద్రోహమే… వెన్నుపోటే అని తెలుగు ప్రజలు భావించి ఉండి ఉంటే ఆయన నేతృత్వంలో తమ ముందుకు వచ్చిన టిడిపిని అప్పుడే ఓడించి ఉండేవారు కదా? కానీ ప్రజలు కూడా ఆయన పార్టీని కాపాడుకొనేందుకే మావగారి చేతిలో నుంచి పార్టీ పగ్గాలు చేపట్టారని గట్టిగా నమ్మబట్టే టిడిపిని ఇన్నిసార్లు గెలిపిస్తూ ముఖ్యమంత్రిని కూడా చేశారు.

కానీ వైసీపీ నేతలకు ఆయనను నిందించడానికి ‘వెన్నుపోటు అస్త్రంని’ సృష్టించి అవకాశం చిక్కినప్పుడల్లా ఆయనపై ప్రయోగించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. అయితే వారి అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినదేమిటి? ఆనాడు తెలంగాణ ప్రజల సెంటిమెంట్ గౌరవిస్తానని చెప్పి మాట తప్పి, మడమ తిప్పి సమైక్యాంద్ర ఉద్యమాలు చేశారు కదా?తెలంగాణలో తననే నమ్ముకొని ఉద్యమాలకి దూరంగా ఉండిపోయిన కొండా సురేఖ వంటి వైసీపీ నేతలనీ, వారి రాజకీయ భవిష్యత్‌ను నడిరోడ్డుపై వదిలేసి ఆంద్రాకు వచ్చేయలేదా?తన కోసం శక్తికి మించి శ్రమించిన తల్లిని, చెల్లిని బయటకు సాగనంపలేదా?

ఎన్టీఆర్‌ వీరాభిమానని చెప్పుకొనే కొడాలి నాని ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు మౌనంగా ఉండిపోలేదా?వైసీపీలో ఉంటూ నేటికీ ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్‌ ఫోటోలతో ఫ్లెక్సీలు వేయించుకొంటూ నీచ రాజకీయాలు చేయడం లేదా? అడగలంటే ఇలా చాలా ప్రశ్నలే ఉన్నాయి. కానీ కర్ర ఉన్నవాడిదే బర్రె అన్న తీరులో వైసీపీ పాలన సాగుతోంది కనుక ప్రజలు ప్రేక్షకపాత్రకు పరిమితం కాక తప్పడం లేదు.

కానీ రాజకీయాలలో ఉన్నందున చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ నిజాలను నిర్భయంగా ప్రజల ముందు, ముఖ్యంగా… ఇవి తెలియనట్లు నటిస్తున్న కొడాలి నాని వంటి వైసీపీ నేతలకు తెలియజెపుతున్నారు. ఆ ప్రమోని చూసే ఇంత కంగారు పడితే రేపు అన్‌స్టాపబుల్‌గా రాబోతున్న వారిద్దరినీ వైసీపీ నేతలు ఎదుర్కోగలరా?