అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్కపిల్ల కాదేదీ వ్యాపారానికి అనర్హమన్నట్టు… తాజాగా ఉత్తరప్రదేశ్ లో నయాదందా షురూ అయింది. అందమైన అమ్మాయిల ఫోన్ నెంబర్లను రీ ఛార్జ్ అవుట్ లెట్లు అమ్మకానికి పెడుతున్నాయి. అమ్మాయి అందాన్ని బట్టి అమ్మాయి ఫోన్ నెంబర్ కు ధర నిర్ణయిస్తున్నారు. అందమైన అమ్మాయి ఫోన్ నెంబర్ కావాలంటే సుమారు 500 రూపాయలు, ఆ పైన ఖర్చు చేయాల్సిందేనని రీ ఛార్జ్ అవుట్ లెట్లు పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆకతాయిల ఫోన్ నెంబర్ల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ తో యువతులు బెంబేలెత్తిపోతున్నారు.
ఈ మధ్య కాలంలో ఆకతాయిల ఫోన్ కాల్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దర్యాప్తు చేసిన పోలీసులు, మొబైల్ నెంబర్ల విక్రయం పెద్ద దందాగా మారిందని గుర్తించారు. ఇదే సమాచారం సిఎంకు అందివ్వగా, తక్షణ చర్యల నిమిత్తం అఖిలేష్ యాదవ్ ఏర్పాటు చేసిన ఫిర్యాదుల నెంబర్ 1090 కు ఏకంగా 5,82,854 ఫిర్యాదులు ఆకతాయిలు తమను ఫోన్ లో వేధిస్తున్నారని చేయడం విశేషం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఈ రాకెట్ గుట్టుమట్లు కూపీలాగారు.



