తన అందచందాలతో సామాజిక మాధ్యమాల్లో వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న 20 ఏళ్ళ రాజస్థాన్ భామ మానసి దీక్షిత్ దారుణహత్యకు గురైంది. ముంబైలో ప్రముఖ మోడల్ గా పేరొందిన ఈ బ్యూటీ మృతదేహం ఓ ట్రావెల్ బ్యాగులో లభ్యం కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… రాజస్థాన్ లోని కోట ప్రాంతానికి చెందిన మానసి మోడలింగ్ లో రాణిస్తోంది.
[m9ad]
ఆరు నెలల క్రితం ఆమె ముంబైకి వచ్చి, అంధేరీ ప్రాంతంలో నివాసాన్ని ఏర్పరచుకుంది. ఆమెకు అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ (19) అనే డిగ్రీ సెకండియర్ చదువుతున్న యువకుడు పరిచయం అయ్యాడు. వీరిద్దరి మధ్యా స్నేహం ఏర్పడింది. ఏం గొడవ జరిగిందో ఏమో కానీ, ఆమెను దారుణంగా హత్య చేసిన సయ్యద్, బ్యాగులో మృతదేహాన్ని కుక్కి, మలాద్ ప్రాంతంలో ఉన్న మైండ్ స్పేస్ వద్ద చెత్తలో పడేశాడు.
అక్కడి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి ఆ మృతదేహం మానసిదని తేల్చారు. విచారిస్తున్న క్రమంలో సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా, ఓ క్యాబ్ లో వచ్చిన సయ్యద్, మృతదేహాన్ని అక్కడ పడేసినట్టు కనిపించింది. సయ్యద్ ను అరెస్ట్ చేశామని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.



