మందులా ప్రజలకు యూపీఐ అలవాటు చేసి ఇప్పుడు బాదుడా?

UPI charges above Rs 2000

మందు బాబులు మందు కొట్టని తమ దోస్తులకు మందు అలవాటు చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తారు. ఒకసారి దానికి అలవాటు పడిన తర్వాత వారు మందు పోయడం మానేస్తారు. అప్పుడు ప్రతీసారి కొనుక్కొని తాగాల్సిందే!

నగదు రహిత లావాదేవీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇదే విధానం అవలంభించిందని చెప్పక తప్పదు. ప్రజలు యూపీఐ చెల్లింపులకు బాగా అలవాటుపడిన తర్వాత, ఇప్పుడు యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించింది. కనుక ఇకపై ఆ ఛార్జీలు చెల్లించక తప్పదు.

ADVERTISEMENT

పర్సన్ టూ పర్సన్ (పి2పి), పర్సన్ టూ మర్చంట్ (పి2ఎం) రెండు కేటగిరీలలో రూ.2,000ల లోపు లావాదేవీలలో సామాన్య ప్రజలపై, చిన్న వ్యాపారులపై ఎటువంటి భారం మోపడం లేదని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. అంటే రూ.2,000కు మించిన లావాదేవీలపై ఛార్జీలు ఉంటాయని చెపుతోందన్న మాట!

ఉదాహరణకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, ఫోన్, విద్యుత్ బిల్లులు, ఇన్స్యూరెన్స్ ప్రీమియం, రైల్వే టికెట్స్ కొనుగోలు కొరకు రూ.2,000కు మించిన చెల్లింపులపై ఫ్లాట్ రూ.5 ఛార్జీ ఉంటుందని పేర్కొంది.

క్యూఆర్‌ కోడ్ ద్వారా నెలకు లక్ష రూపాయల లోపు చెల్లింపులు పొందే వ్యాపారులను దీని నుంచి మినహాయించినట్లు తెలిపింది. కానీ పి2ఎంలో రూ.2,000 మించి చెల్లింపులపై 0.4శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీని గరిష్ట పరిమితి రూ.300 అని తెలిపింది.

పి2పి లావాదేవీలపై అంటే కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులు, ఇరువురు వ్యక్తుల మద్య జరిపే చెల్లింపులపై ఎటువంటి పరిమితి, ఛార్జీలు ఉండవని చెప్పలేదు. కనుక ఉంటుందో లేదో.. ఉంటే ఎంత చెల్లించాలో అక్టోబర్ 15 తర్వాత తెలుస్తుంది.

ఇప్పుడు ఏటీఎంలలో రూ.5,10,20,50 నోట్లు లభించడం లేదు. కనుక దేశ ప్రజలు రూ.5,10 వంటి చిన్న చెల్లింపులకు కూడా యూపీఐనే వాడక తప్పడం లేదు. వాడితే ఛార్జీ చెల్లించాలని చెపుతోంది.

మొదట నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించినది కేంద్ర ప్రభుత్వమే. బహుశః అందుకోసమే ఆ తర్వాత క్రమంగా చిన్న నోట్ల సరఫరా తగ్గించి ఉండవచ్చు. ప్రజలు పూర్తిగా యూపీఐపై ఆధారపడేలా చేసి, ఇప్పుడు వారిపై ఈ అదనపు భారం మోపేందుకు సిద్దమవుతోంది.

అయితే క్రెడిట్, డెబిట్ కార్డులు, వ్యాలెట్ ఛార్జీలతో పోలిస్తే ఈ యూపీఐ ఛార్జీలు చాలా స్వల్పమని సమర్ధించుకుంటోంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు, డిజిటల్ చెల్లింపు లిక సదుపాయాలు మెరుగు పరచడానికి ఇది చాలా అవసరమని చెపుతోంది.

ఇప్పుడే కాదు.. ఎప్పుడూ.. ఏదీ ఉచితంగా లభించదనేది వాస్తవం. కనుక ఇకపై యూపీఐ సేవలకు కూడా కొంత రుసుం చెల్లించక తప్పదు.

అలాగే దీని వలన వ్యాపారులపై పడే భారం కూడా వారు తిరిగి ఏదో రూపంలో సామాన్య ప్రజలకే బదలాయిస్తారు కనుక ఆ భారం కూడా మోయక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories