నేడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ దేశాల ప్రతినిధుల మద్య శాంతి చర్చలు జరుగబోతున్నాయి. శాంతి చర్చలకు ఇరాన్ ప్రతినిధులు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఇస్లామాబాద్ చేరుకున్నారు.
అయితే ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు తుపాకులు గురిపెట్టుకొని మాట్లాడుకుంటే ఆ చర్చలు ఫలిస్తాయా? అంటే కాదనే అర్ధమవుతోంది.
అమెరికా ముఖ్య షరతులు: 1.ఇరాన్ అన్వాయుధాల తయారీకి శుద్ధిచేసిన యురేనియం అమెరికాకు అప్పగించాలి. 2. హోర్మూజ్ జలసంధిని బేషరతుగా తెరిచి అన్ని దేశాల నౌకలను అనుమతించాలి.
ఇరాన్ షరతులు: లెబనాన్ మీద తక్షణం దాడులు నిలిపివేయాలి. ఇరాన్ మీద మళ్ళీ దాడి చేయబోమని హామీ ఇవ్వాలి. హోర్మూజ్ జలసంధిపై సర్వాధికారాలు ఇరాన్‌కే ఉంటాయి. ఇరాన్‌కు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలి.
అమెరికా షరతులు తమకు ఆమోదం కావని ఇరాన్ ఇప్పటికే తేల్చి చెప్పింది. లెబనాన్ మీద దాడులు నిలిపివేసేందుకు ట్రంప్ అంగీకరించారు. ఇజ్రాయెల్‌ని కూడా నిలిపివేశారు. కానీ లెబనాన్‌లో హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపులని సమూలంగా తుడిచిపెట్టేసే వరకు తమ యుద్ధం పూర్తి కాదని బెంజమిన్ నెతన్యహూ తెగేసి చెప్పారు. అంటే ఇరాన్ మొదటి షరతు పాటించమని ముందే చెప్పెశారన్న మాట!
ఇరాన్‌కి ఇదే ఆఖరి అవకాశమని, తమ షరతులకు అంగీకరిస్తే సరేసరి లేకుంటే ఇరాన్‌ని సమూలంగా తుడిచిపెట్టేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్ స్పందిస్తూ, “నేటికీ మా వేళ్ళు ట్రిగర్ మీదనే ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేస్తే ఈసారి మరింత ధీటుగా బదులిస్తాము, “ అని ఘాటుగా హెచ్చరించింది.
ఓ పక్క ఒకరినొకరు ఈవిధంగా బెదిరించుకుంటుంటే శాంతి చర్చలు సఫలమవుతాయా?అంటే కాదనే అర్ధమవుతోంది. కనుక త్వరలో మళ్ళీ అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలవుతుంది.
దానికి సిద్ధమని అమెరికా-ఇరాన్ రెండూ ముందే చెప్పేశాయి. కనుక ఈ శాంతి చర్చలు రెండు వారాలు కాలక్షేపం కోసమే తప్ప యుద్ధం ముగిసే అవకాశం లేదు.






