మోడీ గొప్పతనమా? రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలా?

uttarpradesh elections narendra Modi-victory ప్రస్తుతం వెల్లడవుతున్న ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ విశ్లేషకుల్లో సరికొత్త ఆలోచనలను రేపుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత ప్రధానిగా నరేంద్ర మోడీ గ్రాఫ్ డౌన్ అయ్యిందని, ఇది తమకు అనుకూలంగా మారుతుందని భావించిన కాంగ్రెస్ ఆశలపై నీళ్ళు జల్లే విధంగా ఈ ఫలితాలలో అసలు కీలక పాత్ర పోషించిన అంశాలు ఏంటి? నిజంగానే మోడీ మాయాజాలపు మాటలకు పడిపోయారా? లేక ఇప్పటివరకు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజలు విసిగివేసారిపోయారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ADVERTISEMENT

ఇందులో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఎక్కువ శాతం మాత్రం మోడీ ప్రభావానికి మించి స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ఈ ఎన్నికల్లో ప్రధాన భూమికను పోషించాయని అభిప్రాయ పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో పెరిగిన హింసాకాండలు, అసహనం, గత రెండు, మూడేళ్లలో జరిగిన నేరాలు వంటివి ఓటర్లను బీజేపీ వైపు ఆకర్షితులను చేశాయి. దీంతో ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్ గద్దె దిగక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఓ రకంగా యూపీలో గెలుపు బీజేపీకి సరికొత్త ఔషధమే.

సరిగ్గా పంజాబ్ లో సైతం ఇదే జరిగింది. అధికారంలో ఉన్న అకాలీదళ్-బీజేపీ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టలేక పోయిన అకాలీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడైంది. ఇక గోవా కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోలేదు. అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి తిరిగి గెలుస్తుందని చేసిన ఊహాగానాలు పటాపంచలయ్యేలా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ ముఖ్యమంత్రి కూడా ఓడిపోవడం గమనార్హం. అయితే కాంగ్రెస్ కూడా స్వల్ప ఆధిక్యంలోనే ఉంది.

ఉత్తరాఖండ్ లో సైతం అధికార కాంగ్రెస్ స్వీయ తప్పిదాలు ఆ పార్టీకి చేటు తెచ్చాయి. దీంతో ఉన్న 70 నియోజక వర్గాలలో 50కి పైగా స్థానాలతో బీజేపీ అధికారాన్ని ఖాయం చేసుకోబోతోంది. ఎటొచ్చీ మణిపూర్ లో మాత్రం గట్టి పోటీ కొనసాగుతుండగా బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉంది. మొత్తం మీద మోడీ చరిష్మా కనిపించినప్పటికీ, రాష్ట్ర రాజకీయాలు, ఆయా ప్రాంత పరిస్థితులే ఎక్కువగా ప్రభావం చూపినట్టు “చేతులు మారుతున్న అధికారమే” చాటి చెప్తోంది.

ADVERTISEMENT
Latest Stories