మళ్ళీ జగన్ వద్దకు గన్నవరం పంచాయతీ… తేలేనా?

vallabhaneni vamsi Dutta ramachandra rao gannavaram constituency issueగన్నవరం పంచాయతీ మళ్ళీ సిఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరింది. వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకే మళ్ళీ గన్నవరం టికెట్ సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఖారారు చేసినప్పటికీ, వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. వంశీ ఎన్ని ప్రయత్నాలు చేసుకొన్నా వచ్చే ఎన్నికలలో తమకే గన్నవరం టికెట్ ఖాయమని ప్రచారం చేసుకొంటున్నారు.

ఆ ప్రయత్నాలలో మీడియా ముందుకు వచ్చి వంశీ ఇసుక మాఫియా చేస్తున్నాడని, ఎక్కడికక్కడ కమీషన్లు నొక్కేస్తున్నాడని పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. దాంతో వంశీ కూడా ధీటుగా స్పందించక తప్పడం లేదు. ఈవిదంగా నియోజకవర్గంలో ముగ్గురు వైసీపీ నేతలు కీచులాడుకొంటుండటంతో, ఇటీవల జరిగిన గన్నవరం నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, “గన్నవరం టికెట్ మళ్ళీ వల్లభనేని వంశీకే ఇస్తానని సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు. కనుక ఈ అంశంపై నియోజకవర్గంలో ఎవరూ మీడియా ముందుకు వచ్చి వేరేగా మాట్లాడవద్దు. మాట్లాడితే పార్టీ పరంగా కటిన చర్యలు తీసుకోవలసి వస్తుంది,” అని హెచ్చరించారు కూడా.

ADVERTISEMENT

అయినా దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. టిడిపిపై అలిగి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీకి నియోజకవర్గంలో ఇద్దరు వైసీపీ నేతలు రోజూ పొగ పెడుతుండటంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో ఈ సమస్యను జగన్ దృష్టికి తీసుకువెళ్ళగా సోమవారం సాయంత్రం వంశీని తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడారు.

వారిరువురిని కూడా కలుపుకుపోవడానికి తాను ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారిరువురు తనకు చాలా ఇబ్బంది పెడుతున్నారని వంశీ సిఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ప్రతిపక్ష టిడిపితో ఎటువంటి సమస్యలేదు కానీ సొంత పార్టీలో నేతలతోనే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు.

మరి సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ గన్నవరం పంచాయతీని ఏవిదంగా పరిష్కరిస్తారో? అసలు పరిష్కరిస్తారో లేక వల్లభనేని వంశీనే బయటకు పంపిస్తారో తెలీదు. కానీ టిడిపిని విడిచిపెట్టి వైసీపీలో చేరడం చాలా పెద్ద పొరపాటనివల్లభనేని వంశీ ఈ పాటికి గ్రహించే ఉంటారు. వైసీపీలో ఇమడలేకపోతున్నారు కనుక మళ్ళీ టిడిపిలోకి తిరిగివస్తారా?ఏమో!

ADVERTISEMENT
Latest Stories