గత కొంత కాలంగా వంగవీటి రాధను వైకాపా పక్కన పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన కోరుకున్న విజయవాడ సెంట్రల్ సీటు ఆయనకు కాకుండా పోయింది. ఇక్కడ మల్లాది విష్ణు విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అప్పట్లో పార్టీ నుండి వెళ్లిపోనున్నట్టు ఇండికేషన్ ఇచ్చిన రాధా ఆ తరువాత కొంత తగ్గారు. అయితే పార్టీకి మాత్రం దూరంగానే ఉంటున్నారు. బుధవారం నగరంలో పలు ప్రాంతాల్లో రాధా తండ్రి వంగవీటి మోహనరంగా 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
[m9ad]
ఈ కార్యక్రమాల్లో రాధా పాల్గొన్నారు. కానీ ఎక్కడా వైసీపీ జెండాలు కనిపించలేదు. పార్టీ నాయకులు కూడా ఎవ్వరూ ఆయనతో కలిసి వేదిక పంచుకోలేదు. వైకాపా నేతలు విడిగానే ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాధా మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందంటూ వ్యాఖ్యానించారు. నగరంలో జరిగిన రంగా వర్ధంతి కార్యక్రమాలలో ఎక్కడా వైకాపా జెండాలు కానీ సీపీ నేతల సందడి కానీ కనిపించలేదు. విజయవాడ సెంట్రల్ సీటు నుంచి 2004లో కాంగ్రెస్ తరఫున రాధా ఎమ్మెల్యేగా గెలిచారు.
అదే స్థానం నుంచి 2009లో పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో విజయవాడ తూర్పు నుంచి వైసీసీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో రాధా ఉన్నారు. అయితే మల్లాది విష్ణుని తెర మీదకు తెచ్చారు జగన్. తూర్పులో యలమంచిలి రవిని తేవడంతో అన్ని దార్లు మూసుకుపోయినట్టు అయ్యింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం తనను కావాలనే దూరం పెడుతుందన్న భావనలో రాధా ఉన్నారు. పార్టీ నుంచి పొమ్మనకుండా పొగబెడుతున్నారని ఆయన భావిస్తున్నారు.
రాధా మిత్రుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆయనను వైకాపా వీడకుండా అప్పుతున్నారట. జనసేనలోకి గానీ టీడీపీలోకి గానీ వెళ్ళాలని ఆయన మీద ఒత్తిడి ఉంది. సామాజిక వర్గ లెక్కల పరంగా జనసేన వైపే ఆయన మొగ్గుచూపుతున్నారట. అయితే వైకాపా పొమ్మంటే తనకు రాజకీయంగా మైలేజ్ వస్తుందని రాధా భావిస్తున్నారట. అయితే వైకాపా ఆ పని చేస్తుందా అంటే అనుమానమే. ఈ తరుణంలో రాధా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.



