టిడిపి, కాంగ్రెస్ నేతలు మంత్రి హరీష్ రావుపై ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు. గజ్వేల్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ పై పోటీచేయనున్న కాంగ్రెస్ అభ్యర్ది వంటేరు ప్రతాపరెడ్డి మళ్లీ ఆరోపణలు గుప్పించారు. గతంలో తానూ, హరీశ్ రెండు సార్లు కలిసి కూర్చొని మాట్లాడుకున్నామని ఆయన చెబుతున్నారు. ఒక ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడిన దానితో సహా అన్నింటికీ ఆధారాలున్నాయని ఆయన తెలిపారు.
[m9ad]
హైదరాబాద్‌లోనే తమ భేటీ జరిగిందని.. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆధారాలు చూపిస్తానని వంటేరు అన్నారు. ఏ దేవుడి ముందైనా ఒట్టు వేయడానికి తాను రెడీ అని.. హరీశ్ సిద్ధమా? అని ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలను హరీశ్ సహా తెరాస నేతలు ఖండిస్తూ వస్తున్నారు.
సీఎం సొంత నియోజకవర్గం బాధ్యతలు చూస్తున్న హరీశ్ రావు దృష్టి మరల్చే ప్రయత్నమిదని వారు అంటున్నారు. హరీశ్ లేకపోతే గెలవడం తేలికని కాబట్టి ఆయనపై సీఎంకు అనుమానం కలిగిస్తే ఆయనను తప్పిస్తారని వంటేరు ప్లాన్ అని తెరాస నాయకులు అంటున్నారు. ఇప్పటికే ఆయన మీద ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసారు. వంటేరుకు డిపాజిట్ దక్కకుండా చేస్తా అని హరీశ్ ఇప్పటికే ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని మీడియా వర్గాల కథనాల ప్రకారం గజ్వెల్ లో హోరాహోరీ పోరు జరగబోతుంది.



