ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన కేసులో విరసం నేత వరవరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు ఉదయం నుంచి పుణె పోలీసులు ఆయనతో పాటు కుమార్తెల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు. సోదాలు ముగిసిన తర్వాత వరవరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
[m9ad]
పరీక్షలు ముగిసిన తర్వాత ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి అనంతరం పుణె తరలించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రలో వరవరరావు పేరు ఉన్నట్లు గతంలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మావోయిస్టులకు నిధుల సమీకరణలోనూ వరవరరావు పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు తమను సుమారు ఏడు గంటల పాటు నిర్బంధించి సోదాలు చేశారని వరవరరావు భార్య మీడియాకు తెలిపారు. మావోయిస్టులు రాసిన లేఖలో కేవలం ఆయన పేరు ఉన్నందునే ఇలా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వరవర రావుతో పాటు మరో ఇద్దరు పాత్రికేయులను, ఒక ప్రొఫెసర్ ను కూడా విచారించినట్టు సమాచారం.



