alla-nani-to-join-in-tdp

రాజకీయ నేతలు పార్టీలు మారడం.. అదీ.. ఎన్నికలలో ఓడిపోయిన పార్టీని వీడి అధికార పార్టీలోకి మారడం చాలా సహజమే. వారు తమ అవసరాలు, రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారితే, వారి చేరికలతో తమ పార్టీకి కలిసివస్తుందనే ఉద్దేశ్యంతో వారిని చేర్చుకుంటాయి పార్టీలు.

తాజాగా వైసీపీ ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆళ్ళ నాని (కాళీకృష్ణ శ్రీనివాస్) నేడు టీడీపీలో చేరబోతున్నారు. మంత్రివర్గ సమావేశం తర్వాత ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు.

Also Read – జగన్‌ గుర్తించలేని మెగాస్టార్‌ని బ్రిటన్ గుర్తించింది!

ఎన్నికలలో ఆయన, వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచనతో మొదట రాజకీయ సన్యాసం ప్రకటించారు. కానీ రాజకీయాల నుంచి తప్పుకునే వయసు, సమయం రెండూ కావని భావించి టీడీపీకి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న జనసేనలో చేరాలనుకున్నారు. కానీ విజయనగరానికి చెందిన ఓ టీడీపీ సీనియర్ నేత సిఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆళ్ళ నానిని టీడీపీలో రప్పిస్తున్నట్లు సమాచారం.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు, అధికారం అనుభవించి, ఎన్నికలలో ఓడిపోగానే టీడీపీలోకి జంప్ అయిపోతుండటం వైసీపీ జీర్ణించుకోవడం చాలా కష్టమే. అలాగే ఏలూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కూడా ఆయన రాకని జీర్ణించుకోవడం కష్టమే.

Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?

ఇంతకాలం, నేటికీ కూడా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీని, దాని నేతలను ఆవినీతిపరులని వాదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాజకీయ లెక్కలు, అవసరాల కోసం అదే పార్టీ నేతలను తెచ్చుకోవడం టీడీపీ వీరభక్త, వీరవిధేయ నేతలు, కార్యకర్తలు హర్షించలేరని వేరే చెప్పక్కరలేదు.

కానీ రావణవధ జరగాలంటే లంక గుట్టు తెలియాలి. అందుకే నాడు శ్రీరాముడు అంతటివాడు విభీషణుడుకి ఆశ్రయం కల్పించారు. అప్పుడూ లక్ష్మణుడితో సహా అందరూ వారించారు. కానీ శ్రీరాముడి నిర్ణయం సరైనదని రావణవధ తర్వాత తెలిసింది.

Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..

ఏపీలో అమరావతి తదితర ఈ అభివృద్ధి పనులు కొనసాగాలన్నా, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావలన్నా మళ్ళీ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా అధికారంలోకి రావలసి ఉంటుంది. అందుకోసం లంక గుట్టు చెప్పే కోటంరెడ్డి, బాలినేని, ఆళ్ళ నాని వంటి విభీషణులు అవసరమే.

కానీ తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న జగన్‌ కుంభకోణాల మూలాలు కనిపెట్టాలంటే మాంత్రికుడి ప్రాణాలున్న చిలుక ఎక్కడుందో కూడా కనిపెట్టాలి. కనుక ఆళ్ళ నాని వంటి వారిని తెచ్చుకుంటున్నారని భావించవచ్చు.

సిఎం చంద్రబాబు నాయుడు ఇంత దూరం ఆలోచిస్తున్నారనే విషయం సీనియర్ నేతలే పార్టీ కార్యకర్తలకు చెప్పుకోవలసి ఉంటుంది. లేకుంటే వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మే ప్రమాదం ఉంటుంది.