
సోమవారం దేశరాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఒకేరోజు మూడు ప్రధాన పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిలో ఒకటి మంచిది రెండు కేంద్రాన్ని ఇబ్బంది పెట్టేవి. మంచిది అంటే బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యాను భారతదేశానికి అప్పగించాలని లండన్ లోని ఒక కోర్టు కాసేపటి క్రితం ఆదేశించింది. 9 వేల కోట్ల మేరకు బ్యాంకులను మోసం చేయడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటి ఆరోపణలతో ప్రస్తుతం ఆయనపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే.
[m9ad]
అరెస్టును తప్పించుకోవడానికి ఆయన 2016లో ఆయన దేశం వదిలి పారిపోయారు. ఈ తీర్పుపై మాల్యా అపీలు చేయడానికి అవకాశం ఉంది. మరో కీలకమైన పరిణామం ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్రానికి పంపించారు. ఇటీవల కాలంలో ఆర్‌బీఐ గవర్నర్‌కు కేంద్ర పెద్దలకు మధ్య దూరం పెరిగింది. ఆర్‌బీఐ వద్ద మిగులు నిధుల బదలాయింపు కొరకు కేంద్రం ఒత్తిడి చేస్తుందని వార్తలు వచ్చాయి. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే విమర్శల నేపథ్యంలో ఆయన రాజీనామాకు ప్రాముఖ్యత ఏర్పడింది.
మరో కీలక పరిణామం పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా ఒక్కరోజు ముందు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) చీఫ్ ఉపేంద్ర కుశ్వాహ ఎన్డీయే ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వెళ్తూ వెళ్తూ ఆయన ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవలే కాలంలో టీడీపీ తరువాత ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన మరో పార్టీ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ. మొత్తానికి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఎన్డీయే నుండి బయటకు రావడం, ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చెయ్యడం వంటి పరిణామాల నేపథ్యంలో విజయ్ మాల్యా వార్త కేంద్రానికి ఊరట కలిగించేదే.



