Vijay Sai Reddy

మీరు ఇంట్లో నుంచి అడుగు బయటపెడుతున్నారా?అయితే మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఈ విషయం మీకు తెలియకపోవచ్చు కానీ వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డికి తెలుసు. అందుకే శ్రేయోభిలాషిగా ముందే రాష్ట్ర ప్రజలని హెచ్చరిస్తున్నారు.

“హోమ్ మంత్రి, ముఖ్యమంత్రి మాటలతో కాలక్షేపం చేస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయిందట! బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయట! రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు జరిగిపోతున్నాయట!

Also Read – నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?

రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో టిడిపి కూటమి ప్రభుత్వం, హోమ్ మంత్రి వైఫల్యం చెందారు కనుక నైతిక భాద్యత వహించి రాజీనామా చెయ్యాలని, గవర్నర్ తక్షణమే విచారణకు ఆదేశించాలని విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని తెలియక కోట్ల మంది ప్రజలు పండుగలు పబ్బాలు చేసుకుంటున్నారు. కుటుంబాలతో కలిసి సినిమాలకు, షికార్లకు వెళుతున్నారు. ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటున్నారు. రోడ్లపై యధాప్రకారం బస్సులు, వాహనాలు తిరుగుతున్నాయి.

Also Read – నేను భారతీయురాలినే అంటున్న ప్రభాస్ హీరోయిన్.

జనాలకు కనబడని ప్రమాదం విజయసాయి రెడ్డి ఒక్కరికే ఎలా కనబడుతోంది?అంటే నీలి రంగు కళ్ళద్దాలు పెట్టుకోవడం వలన కావచ్చు లేదా జగన్‌ తనను కూడా ఎక్కడ పక్కన పెట్టేస్తారో అనే భయం వలన కావచ్చు.

ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు సినిమాలకు ఏదో ఓ ‘ట్యాగ్ లైన్’ ఉన్నట్లే, ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత వైసీపి కూడా ‘రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనే’ ట్యాగ్ లైన్ పెట్టుకొని దుష్ప్రచారం చేస్తూనే ఉంది. ఓ అబద్దాన్ని అందరూ కలిసి పదేపదే చెపితే అదే నిజం అయిపోతుంది అనే ఫార్ములాతో వైసీపి ఈ దుష్ప్రచారం చేస్తున్నట్లు భావించవచ్చు.

Also Read – వైసీపీ నేతల కేసులు.. ఎక్స్‌ఎల్ షీట్ పెట్టాలేమో?

కానీ ఇటువంటి దురాలోచనలు, తమ అరాచక పాలన కారణంగానే ప్రజలు తమని తిరస్కరించారని అంగీకరించకుండా నేటికీ ఇలా కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటే ప్రజలు ఎలాగూ అసహ్యించుకుంటారు. పైగా ఈ దుష్ప్రచారంతో టిడిపి కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నిస్తే వాటికి సమాన పర్యవసానాలు కూడా ఉంటాయని గ్రహిస్తే మంచిది.