
వైసీపీ అంతర్గత విషయాల గురించి ఏమైనా చెప్పాలంటే జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కావాలి లేదా జగన్ చుట్టూ ఉన్నవారిలో కీలక వ్యక్తి అయినా అయ్యుండాలి.
పార్టీ అధికార ప్రతినిధులు, అప్పుడప్పుడు తాడేపల్లి ప్యాలస్ సమావేశాలకు వచ్చిపోయే అంబటి రాంబాబు, రోజా వంటి వారు చెప్పే మాటలు ప్రజలు, మీడియా కాలక్షేపం కోసం మాత్రమే.
Also Read – సలహాదారులంటే వీరు కదా..
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల పార్టీని, పదవిని, రాజకీయాలను విడిచిపెట్టే వరకు ఆ పార్టీలో నంబర్: 2 స్థానంలో ఉండేవారు. అయితే పార్టీలో మరికొందరు ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత వారి చెప్పుడు మాటలు వింటూ జగన్ తనని దూరం పెట్టేవారని విజయసాయి రెడ్డి కుండబద్దలు కొట్టారు.
కాకినాడ పోర్టు కేసులో బుధవారం విజయవాడలో ఏపీ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరైన తర్వాత బయట మీడియాతో మాట్లాడుతూ, “ఇదో తప్పుడు కేసు. దీంతో నాకు ఎటువంటి సంబందమూ లేదు. ఉందని నిరూపించే ఒక్క ఆధారం కూడా చూపలేకపోతున్నారు,” అని ఆరోపించారు.
Also Read – సుప్రీంకోర్టుకే కుచ్చు టోపీ పెడుతున్నారే!
వైసీపీకి దూరం అవడం గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, “జగన్ చుట్టూ కోటరీ ఉండేది. వారికి ఏదైనా లాభం ఉంటేనే జగన్‌ని కలిసేందుకు అవకాశం కల్పిస్తుంటారు. వారి వలననే నేను జగన్‌కి దూరమయ్యాను. వారు నాపై పిర్యాదులు చేస్తూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతుంటే, నేను ఒక్కో మెట్టు కిందకు దిగుతూ చివరికి బయటకు వెళ్ళిపోవలసి వచ్చింది.
ఆయన మనసులో నాకు స్థానం లేడని గ్రహించిన తర్వాత వెళ్ళిపోయే ముందు ఆయనకు ఫోన్ చేసి, మీ చుట్టూ ఉన్న కోటరీని చేధించుకొని బయటకు రాలేకపోతే మీకు, మీ పార్టీకి భవిష్యత్ ఉండదని స్పష్టంగా చెప్పాను. కానీ ఆయన ఆ సలహాని కూడా పట్టించుకోకుండా విలువలు, విశ్వసనీయత అంటూ ఏదేదో మాట్లాడుతూ నన్ను నిందించారు. అటువంటి నాయకుడున్న ఏ పార్టీ బాగుపడదు,” అని విజయసాయి రెడ్డి వైసీపీ భవిష్యత్ ఏవిదంగా ఉండబోతోందో చెప్పేశారు.
Also Read – వైఎస్ అవసరం జగన్‌కే.. అందుకే ఈ హడావుడి?
విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు కనుక ఈవిదంగా మాట్లాడుతున్నారని అనుకోవడానికి లేదు. సాక్షి మీడియాతో సహా సజ్జల, ఐ ప్యాక్, పలువురు ఐఏఎస్, ఐపీస్ అధికారులు జగన్‌కి ఏవిదంగా శల్య సారధ్యం చేసి ముంచేశారో అందరూ కళ్ళారా చూశారు.
అందుకే ఓటమి తర్వాత సజ్జల వంటివారిని జగన్ కొంతకాలం దూరంగా పెట్టారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త నేతలతో జగన్ చుట్టూ మరో కోటరీ తయారైంది. కోటరీ సాయంతో నడిచే పార్టీ భవిష్యత్ ఏవిదంగా ఉంటుందో చూశాము. కనుక చరిత్ర పునరావృతమవుతుందని ఎవరో కాదు.. ఒకప్పుడు జగన్ రైట్ హ్యాండ్ విజయసాయి రెడ్డి తేల్చి చెప్పేశారు.