కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులకు రాజ్యసభ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాలు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించినా ఓటింగుకు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ ఒప్పుకోలేదు. ఈ బిల్లులు రైతులకు తేనె పూసిన కత్తి లాంటివని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించారు.
తెరాస ఈ బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడింది. అయితే అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలిపింది. గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికారపక్ష పార్టీలు కేంద్రం విషయంలో భిన్నమైన వైఖరి కలిగి ఉండటం గమనార్హం. అభ్యంతరకరమైన విషయాలలో తెరాస మద్దతు ఇవ్వనప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం నిర్ద్వంధంగా సపోర్ట్ చేస్తుంది.
ఈ బిల్లుల పై రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ దళారుల పార్టీ కావడంతోనే ఈ బిల్లులను వ్యతిరేకిస్తుంది అంటూ విమర్శించి అధికారపక్షం మెప్పు పొందాలని ప్రయత్నం చేసారు. మరోవైపు… ఈ బిల్లులను రైతు సంఘాలు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు.
“ప్రభుత్వం రైతులకు ఇచ్చే మద్దతు ధర నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ బిల్లుల కారణంగా రైతుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలోకి పడినట్టుగా అవుతుంది. దళారుల మాట దేవుడెరుగు…. ఇప్పుడు కార్పొరేట్లు… ప్రైవేటు సంస్థల దయాదాక్షిణ్యాల మీద రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి రావొచ్చు,” అని వారు ఆందోళన చెందుతున్నారు.



