పక్కలో బల్లెం.. విజయసాయి వచ్చేస్తున్నారుగా

Vijayasai Reddy Politics: Can He Shake Up Andhra Pradesh Politics?

ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా ఏపీలో కుల సమీకరణాలు ఇంకా బలంగా ఉన్నాయి. సొంత డబ్బా కోసం సొంత ఛానల్స్ కూడా ఉన్నాయి.

రెండు రాష్ట్రాలలో అధికార పార్టీలు వచ్చే ఎన్నికలలో కూడా గెలిచి అధికారంలో కొనసాగుతామని ఎంత నమ్మకంగా ఉన్నాయో, ప్రతిపక్షాలుగా ఉన్న వైసీపీ, బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు కూడా ఈసారి తప్పకుండా ఎన్నికలలో గెలిచి అధికారంలో వస్తామని అంతే నమ్మకంగా ఉన్నాయి.

ADVERTISEMENT

కనుక రాజకీయ ఆధిపత్యం కోసం వాటి మద్య నిత్యం హోరాహోరీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. జనాలు కూడా ఈ అధికార ప్రతిపక్షాల మధ్యనే నిలువునా చీలిపోయున్నారు. ఈ నేపధ్యంలో చూస్తే రెండు రాష్ట్రాలలో బొత్తిగా రాజకీయ శూన్యత లేదని అర్ధమవుతోంది. కానీ ఉందంటున్నారు కల్వకుంట్ల కవిత, విజయసాయి రెడ్డి.

కల్వకుంట్ల కవిత ఇప్పటికే టీఆర్ఎస్‌ పార్టీతో సిఎం కుర్చీలో కూర్చోవడం లక్ష్యంగా పని మొదలుపెట్టగా, తాజాగా ఆంధ్రాలో కూడా విజయసాయి రెడ్డి బరిలో దిగుతున్నారు. త్వరలో సొంత రాజకీయ పార్టీతో ప్రజల ముందుకు వస్తానని చెప్పిన విజయసాయి రెడ్డి, నేడు దానికి ముహూర్తం ప్రకటించేశారు.

ఈ నెల 7న మధ్యాహ్నం 1.15 గంటలకు విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్‌ హోటల్లో తన భవిష్య రాజకీయ కార్యాచరణ ప్రకటించబోతున్నానని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అది సొంత పార్టీ ఏర్పాటు ప్రకటన కావచ్చు.

తెలంగాణలో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తన తండ్రి కేసీఆర్‌ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి బయటపెడుతూ, బీఆర్ఎస్‌ పార్టీ ముఖ్యంగా హరీష్‌ రావుపై విమర్శలు గుప్పిస్తూ, తనకు అన్యాయం, అవమానం జరిగాయని కంట తడిపెట్టుకుంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకి అధికారం అప్పగిస్తే అమ్మలా రాష్ట్రాన్ని పాలిస్తానని, సామాజిక తెలంగాణ సాధిస్తానని కల్వకుంట్ల కవిత చెపుతున్నారు.

ఇంచుమించు ఆమె పరిస్థితిలోనే ఉన్న విజయసాయి రెడ్డి కూడా అదే ఫార్ములాతో ముందుకు సాగే అవకాశం ఉంది. అయితే కల్వకుంట్ల కవిత ఇంత వరకు ఒక్క పెద్ద బీఆర్ఎస్‌ పార్టీ నేతని, కనీసం కార్యకర్తలను కూడా ఆకర్షించలేకపోయారు.

కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఆంధ్రాలో రీ-ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల కూడా వైసీపీ నేతలను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కనుక షర్మిల వలన కానిది విజయసాయి రెడ్డి వల్లనవుతుందా?విజయసాయి రెడ్డి వైసీపీ నేతలను, ఆకర్షించగలరా?

అదే జరిగితే జగన్‌, సజ్జల ఇద్దరూ ఏవిధంగా రియాక్ట్ అవుతారు? ఒకవేళ విజయసాయి రెడ్డిని నమ్మి వైసీపీ నేతలు రాకపోతే, అప్పుడు ఆయన పరిస్థితి ఏమవుతుంది? అన్ని ప్రశ్నలకు త్వరలోనే తప్పక సమాధానాలు లభిస్తాయి.

ADVERTISEMENT
Latest Stories