సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అంటూ హీరోహీన్స్ కు టాగ్ లైన్ తెచ్చుకున్న తొలి తెలుగు నటి విజయశాంతి. అయితే సినిమాలలో తనకున్న క్రెజ్ ను తన రాజకీయ పెట్టుబడిగా పెట్టి ‘తల్లి తెలంగాణ’ అంటూ సొంత పార్టీని స్థాపించి రాజకీయ ఎంట్రీ ఇచ్చారు.
అయితే ఇక అక్కడ మొదలైన విజయ శాంతి రాజకీయ ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులను, ఎత్తుపల్లాలను చూసింది. అలాగే ఈ ప్రయాణంలో ఎన్నో రాజకీయ పోరాటాలు, మరెన్నో వ్యక్తిగత అవమానాలను ఎదుర్కొన్నారు. అయిన తన రాజకీయ జీవితం ఇప్పటికి ఒక గమ్యం లేని ప్రయాణంలా కొనసాగుతూనే ఉంది.
తన సొంత పార్టీ తల్లి తెలంగాణ నుంచి మొదలు పెట్టి తెరాస, బీజేపీ, కాంగ్రెస్ ఇలా ఎన్నో పార్టీల జెండాలను ఆయా పార్టీల ఎంజెండాలను మోసిన విజయ శాంతి ఇప్పుడు పెళ్ళిలో చూపించే అరుంధతి నక్షత్రం మాదిరి రాజకీయాలలో కనికనిపించకుండా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా ఇటు ప్రభుతంలో కానీ ఇటు పార్టీ పరంగా కానీ ఎటువంటి పదవులు అనుభవించలేని ఒక మహిళా నేతగా మిగిలి పోయారు.
2023 ఎన్నికల ముందు వరకు జాతీయ పార్టీ అయిన బీజేపీ కండువా కప్పుకున్న రాములమ్మ మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే తన ఈ రాజకీయ ప్రయాణంలో అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు రేవంత్ వరకు ఏ ఒక్కరిని మెప్పించలేకపోయారు, ఏ ఒక్క పార్టీకి దగ్గర కాలేకపోయారు ఈ లేడీ సూపర్ స్టార్.
అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఉన్నా విజయ శాంతి రాజకీయాలలో మాత్రమే ఉంటారు కానీ రాజకీయ నాయకురాలిగా ముందుకు ఎదగలేకపోతున్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు పార్టీ కండువాలు మార్చుకున్న వారు సైతం ఎమ్మెల్యే లుగా, ఎంపీ లుగా, చివరికి మంత్రులుగా కూడా మారుతున్నారు.
అలాగే ప్రస్తుత రాజకీయాలలో ఒక పార్టీలో గెలిచి ఆ తరువాత అధికార పార్టీలోకి వచ్చి మంత్రి పదవులు అనుభవిస్తున్న వారు ఉన్నారు. కానీ రాములమ్మ రాజకీయ రాత మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఎన్నికలకు ముందు వరకు మీడియాలో హడావుడి చేసే ఈ మహిళా నేత ఎన్నికల తరువాత మాత్రం ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు.
అటు పార్టీ అధిష్టానాన్ని కానీ, ఇటు రాష్ట్ర స్థాయి పార్టీ పెద్దల దృష్టిని కానీ తన వైపు ఆకర్షించలేకపోతున్నారు. తనకున్న రాజకీయ అనుభవం, ప్రజలలో ఒక సినీ తారగా తనకున్న పేరు ప్రఖ్యాతలు కూడా రాములమ్మ రాజకీయ ఎదుగుదలకు మెట్లుగా మారలేకపోతున్నాయి.
ఈ విషయంలో లోపం ఎక్కడ ఉంది, తప్పెవరిది, సమస్యకు పరిష్కారం ఏమిటి అనే దాని మీద రాములమ్మ ద్రుష్టి పెట్టకపోవడమే ఇక్కడ పెద్ద అవరోధంగా మారుతుంది. తనతో పాటు రాజకీయాలలోకి వచ్చిన వారు, తన తరువాత రాజకీయాలకు పరిచమైన వారు కూడా ఇప్పుడు తనకంటే రాజకీయంగా ఉన్నత స్థానంలోనే కనిపిస్తున్నారు.
ఉదాహరణకు తెరాస విషయమే తీసుకుంటే తన తల్లి తెలంగాణ పార్టీని తెరాస లో విలీనం చేసిన తరువాత కేసీఆర్ చెల్లిగా చెలామణి అయిన విజయ శాంతి అంతకు మించి ఏ ఒక్క పదవిని పొందలేక పోయింది. కేసీఆర్ తో విభేదించి కాంగ్రెస్ గూటికి చేరారు, ఆ తరువాత అక్కడ ఇమడలేక బీజేపీ కండువా కప్పుకున్నారు ఇక అక్కడ ఎదగలేక తిరిగి కాంగ్రెస్ చెంతకు చేరారు.
ఈ పదేళ్ల ప్రతిపక్ష నిరీక్షణ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ విజయ శాంతి ఇంకా అధికార ప్రతిపక్షంలోనే నిరీక్షిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా పార్టీ పెట్టిన రాములమ్మ తన లక్ష్యాన్ని అయితే పొందింది కానీ తన రాజకీయ నిరీక్షణకు మాత్రం ఒక ముగింపు ఇవ్వలేకపోతున్నారు.




