కూటమి లో ఉన్న బీజేపీ ని వేలెత్తి చూపే సాహసం చెయ్యలేని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ, జనసేనలను మాత్రం యిట్టె టార్గెట్ చేయగలుగుతారు. అలాగే ఆ పార్టీల అధినేతల నుంచి ఆ పార్టీల నాయకుల వరకు ఎవరి మీదైనా తన సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్టులు పెట్టి ఆయా పార్టీల అభిమానుల చేత చివాట్లు తింటుంటారు సాయి.
అయితే వైసీపీ ఓటమికి, కూటమి గెలుపుకి ముఖ్య భూమిక పోషించిన జనసేనను టీడీపీ కి దూరం చెయ్యాలనే దురాలోచనకు సాయి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టినట్టు లేరు. టీడీపీ, జనసేన పార్టీల పొత్తు కుదరకూడదని నానా ఫేక్ ప్రచారాలు చేసిన వైసీపీ ఫలితాన్ని పొందలేకపోవడంతో, చివరికి ఆ రెండు పార్టీల మధ్య విద్వేషాలు సృష్టించి పొత్తుని విచ్చినం చేయడానికి ముప్పతిప్పలు పడ్డారు.
Also Read – అప్పుడే కేసీఆర్ కొనేసి ఉంటే..
అది కూడా బూమ్ రాంగ్ అవ్వడంతో ఇక చేసేదేమి లేదని కొన్నాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు మళ్ళీ తన వక్ర బుద్దిని బయటపెట్టుకున్నారు విజయ్ సాయి. యువ రాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ళ వృద్ధుడి నాయకత్వం అవసరమా.? నేషనల్ పాపులారిటీ తో పాటు వయస్సు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కు ఉందని, ఏపీ ఎన్డీయే పార్టీల నాయకులలో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కల్యాణే అంటూ జనసేన అధినేతకు తన స్టైల్ లో కితాబు ఇచ్చారు సాయి రెడ్డి.
అయితే ఇంత సడెన్ గా వైసీపీ ఎంపీ విజయ్ సాయి కి పవన్ మీద ఇంత మంచి అభిప్రాయం ఏర్పడడానికి కారణం ఏమిటో.? గత కోనేళ్ళుగా పవన్ ను ఉద్దేశించి ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు, మూడు పెళ్లిళ్లు అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఈ పెద్ద మనిషికి ఇప్పుడే జ్ఞానోదయం అయ్యిందా.? దాని ఫలితమేనా అప్పుడు ప్యాకేజ్ స్టార్ ఇప్పుడు ఆదర్శవంతుడయ్యాడు.
Also Read – అందరికీ పంచింగ్ బ్యాగ్ మన టాలీవుడ్?
అయితే దీనికంతటికి కారణం పవన్ మీద ప్రేమో, జనసేన మీద అభిమానమో అనుకుంటే వైసీపీ ట్రాప్లో పడ్డట్టే అవుతుంది. ఎదో రకంగా టీడీపీ, జనసేనల మధ్య వివాదం సృష్టించి ఆ మంటలో వైసీపీ రాజకీయం చేసుకోవడానికి వేసే ఎత్తుగడే అనేది అందరికి స్పష్టత ఉంది. పవన్ ను పొగుడుతూనే పరోక్షంగా టీడీపీ ని తగ్గిస్తూ బాబు, లోకేష్ మీద విషం చిమ్మే ప్రయత్నానికి తెరలేపారు.
రెండు పార్టీల పై స్థాయి నేతల మధ్య అగాతం సృష్టించడం సాధ్యం కాదని తేలడంతో ఇక పార్టీ కింద స్థాయి క్యాడర్ ను రెచ్చకొట్టే పనిలో పడ్డారు సాయి గారు. మరో పదేళ్లు ఏపీ కి బాబే ముఖ్యమంత్రిగా ఉండాలని, అప్పుడే ఈ రాష్ట్రం పొరుగు రాష్ట్రాలతో సమానంగా అన్ని రంగాలలో పోటీ పడగలుగుతుందని, దాని కోసం పవన్ గా నేను జనసేనగా నా పార్టీ బాబు కు అండగా ఉంటానంటూ ఏకంగా అసెంబ్లీలోనే ఒక ప్రకటన చేసారు పవన్.
Also Read – ఈ విందుని జగన్ జీర్ణించుకోలేరేమో?
ఇప్పుడు వైసీపీ వచ్చి బాబు వద్దు పవనే ముద్దు అనగానే జనసేన క్యాడర్ సాయిని నెత్తినపెట్టుకుంటుందనే పిచ్చి ఆలోచనలో వైసీపీ వ్యూహాలు వేస్తున్నట్లుంది. పవన్ 21 అంటే 21 , 31 అంటే 31 అంటూ పవన్ నిర్ణయానికి కట్టుబడి తలవంచి వైసీపీ ఓటమి కోసం ఒకటైన జనసేన కార్యకర్తలు ఇప్పుడు వైసీపీ ఉచ్చులో చిక్కుకుంటుంది అని భ్రమ పడడం సాయి అవివేకమే అవుతుంది.