గడిచిన వారం రోజులలో భారత క్రికెట్ అభిమానులకు దెబ్బ మీద దెబ్బ లాగ రెండు పిడుగురాళ్ల వంటి వార్తలు వినాల్సివచ్చింది. తొలుత, భారత టెస్ట్ మరియు వన్-డే సారధి రోహిత్ తన టెస్ట్ కెరీర్ కు ఎండ్ కార్డు వేయగా, అదే బాట లో విరాట్ కోహ్లీ సైతం తన అద్భుతమైన టెస్ట్ కెరీర్ కు గుడ్ బాయ్ చెప్పారు .
దీనితో టీం ఇండియా జట్టులోని ఇద్దరు సీనియర్లు వరుసగా టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు వారి స్థానాన్ని భర్తీ చేసే ఆ ఆటగాలెవ్వరు అనేదాని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది.
గతేడాది జరిగిన టి-20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం కూడా మనం ఇదే చూసాం. విరాట్ మరియు రోహిత్ ఇద్దరు ఒకేసారి పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఆ ఫార్మటు లో వీరికి బ్యాక్-అప్ ఆటగాళ్లు జట్టులో అప్పటికే సిద్ధంగా ఉన్నారు.
కానీ, టెస్ట్ ఫార్మటు సంగతికొస్తే సీన్ మారిపోయింది. జట్టులో ఉన్నదే 4 సీనియర్లు, వారిలో ఇద్దరు ఒకేసారి గుడ్ బాయ్ చెప్పేసరికి జట్టు కూర్పు పై సందేహాలు వ్యక్తపరుస్తున్నారు అభిమానులు.
ఇప్పటికే సీనియర్లైనా పుజారా, రహానే వంటి వారిని జట్టు సెలెక్టర్లు దూరంగా పెట్టేసారు. గతేడాది ఆఖరిలో అశ్విన్, ఇప్పుడు రోహిత్ మరియు కోహ్లీ రిటైర్మెంట్ తో భారత టెస్ట్ బ్యాటింగ్ మొత్తం ఒక్కసారిగా ఎక్సపీరియన్స్ ను కోల్పోయింది. మరి రోహిత్, విరాట్ చోటును భర్తీ చేసేదెవరు..?
ఇప్పటికే ఓపెనర్ గా కె.ఎల్.రాహుల్ సెట్ అవటం తో, రోహిత్ స్థానాన్ని రాహుల్ భర్తీ చేసాడనే చెప్పవచ్చు. కానీ, కోహ్లీ చోటును ఎవ్వరు అంత తేలికగా సమం చేయలేరు. ఒక్క బ్యాట్ తోనే కాక, ఫీల్డ్ లో తాను చూపించే ఉత్సాహం, జట్టు కు నింపే భరోసా మరే ఆటగాడు ఇవ్వలేడు.
రానున్న రోజుల్లో రోహిత్, కోహ్లీ ల ఫీల్డ్ ప్రెజన్స్ ను కచ్చితంగా జట్టు సభ్యులు మిస్ అవుతారు. చూడాలి మరి, వీరిద్దరి ముగింపు ద్వారా టీం ఇండియా లో ఎవరికి ద్వారాలను తెరుస్తుందో అని.




