వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున కడప వైసీపీ ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. కొద్ది సేపటి క్రితం విచారణ ముగించి రేపటికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో అవినాష్ రెడ్డికి మరో 24 గంటలు ఉపశమనం లభించింది.
నేడు హైకోర్టు విచారణలో సీబీఐ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ఇప్పటివరకు తమకు లభించిన అన్ని సాక్ష్యాధారాల ప్రకారం అవినాష్ రెడ్డికి ఈ హత్యకు సంబందం ఉందని, హత్య గురించి అవినాష్ రెడ్డికి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి ముందే తెలుసని కనుక ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ న్యాయవాదులు వాదించారు.
కానీ ఈ కేసును ఇంకా అనేక కోణాలలో విచారించాల్సి ఉండగా సీబీఐ గూగుల్ టేకవుట్, అప్రూవరుగా మారిన దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డిని దోషిగా నిరూపించేందుకే సీబీఐ ప్రయత్నిస్తోందని ఆయన తరపు న్యాయవాది వాదించారు. కనుక సీబీఐ ఆయనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వాదించారు.
సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డే ఆస్తికోసం మామ వివేకానందరెడ్డిని హత్య చేయించాడని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నందున, ఈ కేసులో సునీతా రెడ్డి కూడా ఇంప్లీడ్ అవడంతో ఆమె తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. అందరి వాదనలు ఇంకా పూర్తవనందున ఈ కేసును మళ్ళీ బుదవారం ఉదయం విచారణకు చేపడతామని హైకోర్టు తెలిపింది.
దీంతో సీబీఐ కూడా అవినాష్ రెడ్డిని బుదవారం ఉదయం విచారణకు పిలవాలని నిర్ణయించుకొన్నట్లు సమాచారం. కానీ రేపు కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్‌పై విచారణ జరుగుతుంది కనుక అవినాష్ రెడ్డిని విచారణకు హాజరవ్వాలని సీబీఐ కోరుతుందా లేదా? అనేది ఇంకా తెలియవలసి ఉంది.



