వికేంద్రీకరణ పేరుతో అధికార పక్షం చేస్తోన్న మాటలకు, ప్రస్తుత పరిపాలనలో చేస్తోన్న చేతలకు పొంతన ఎంత ఉందన్నది పక్కన పెడితే, గత ప్రభుత్వంలో చంద్రబాబు అసలు ఏం చేసారు? అభివృద్ధి ఏ ఏ ప్రాంతాలకు ఎలా విస్తరింపచేసారు? నాటి ప్రతిపక్షం ఆరోపించినట్లుగా కేవలం అమరావతిలోనే అన్ని పెట్టేశారా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నమయ్యాయి.
2014లో అధికారం చేపట్టకముందు వరకు అమరావతి అంటే అందరికి గుర్తుకు వచ్చేది ‘శివుని క్షేత్రం’ మరియు ‘బౌద్ధుని స్థూపం’ మాత్రమే! కానీ చంద్రబాబు వచ్చి రాజధాని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండాలని, విజయవాడ అయితే కరెక్ట్ గా ఉంటుందని భావించారు. అయితే నగరంలో ప్రభుత్వ స్థలాలు గానీ, ప్రభుత్వం కొనుగోలు చేసే స్థాయిలో స్థలాల రేట్లు గానీ లేవని విజయవాడ పరిసర ప్రాంతాలలో అన్వేషించగా అమరావతి పేరు ప్రస్ఫుటించింది.
అమరావతి మరీ చిన్న గ్రామం కనుక, చుట్టుప్రక్కన ఉన్న ఇంకొన్ని చిన్న చిన్న గ్రామాలన్నింటిని కలిపి కొత్తగా రాజధానిని చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో అడుగులు వేశారు. దీనికి ప్రభుత్వ భూములు కూడా ఈ ప్రాంతంలో కొన్ని ఉండడం మరింత సానుకూలంగా మారింది. అనుకున్నదే తడవుగా, ప్రకటన చేసిన వెంటనే అన్ని ప్రాంతాల నుండి సానుకూల మద్దతు లభించింది. నాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం కూడా అంగీకారం తెలిపింది.
ఇదంతా జరిగేపాటికి ఏడాదిన్నర్ర గడిచిపోయింది. తదుపరి మోడీ శంకుస్థాపనతో ప్రారంభించిన అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించినా, లేకున్నా రోడ్ల విస్తరణాలు, ఎత్తైన బహుళ స్థాయి నిర్మాణాలు అనతి కాలంలోనే జరిగాయి. అలాగే ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున విరాళాలు కూడా వచ్చాయి. అవకాశం ఉంటే ఒక్క ఇటుక రాయి విలువ అయినా ఇవ్వండి చాలు అంటూ నాడు చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు భారీ స్పందన లభించింది.
తాత్కాలిక నిర్మాణాలుగా అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు వంటి వాటిని నిర్మించి, దీర్ఘకాలిక నిర్మాణాలకు ప్రణాళికలను కేవలం మూడేళ్లల్లో పూర్తి చేసారు. అలాగే ప్రభుత్వ అధికారులు నివసించడానికి కావాల్సిన భవనాలను ఏడాది లోపే పూర్తి చేసారు, పేదలకు ఉచితంగా గృహాలు ఇచ్చేందుకు కొత్తగా వేసిన రోడ్డుకు పక్కనే నిర్మాణాలు గావించారు. కేంద్రం నుండి రావాల్సిన పలు సంస్థలకు భవనాలను నిర్మించి, ఆయా సంస్థలు రావడానికి కారణమయ్యారు.
ఇదంతా కూడా శంకుస్థాపన జరిగిన 2015 నుండి 2019 (మూడున్నర్రేళ్ళ వ్యవధిలో) జరిగింది. ఒక ఇంటి నిర్మాణానికో, అపార్టుమెంటు నిర్మాణానికే మూడు నుండి అయిదేళ్ల సమయం పడుతుంటే, దాదాపు కొన్ని వందల నిర్మాణాలను అనతి కాలంలో పూర్తి చేసారు. అయితే దీని వలన ప్రభుత్వానికి ఖర్చు తప్పితే, ఆదాయం శూన్యం. ఇదంతా భవిష్యత్తు తరాల కోసం, అలాగే రానున్న కాలంలో ఆదాయం వచ్చేలా నాడు ప్రభుత్వం ఖర్చు చేసింది.
కానీ 2014 నుండి 2019 వరకు ఆదాయం అందించే వేదికలను మాత్రం అమరావతిలో ఒక్కటి కూడా పెట్టలేదు. దానిని అటు అనంతపూర్ మరియు ఇటు విశాఖపట్టణంలో విస్తరింప చేసింది. అనంతపురం జిల్లా, పెనుగొండ వేదికగా ఏర్పాటు అయిన కియా ప్లాంట్ కొన్ని వేల మంది జీవితాలకు ఆదాయవనారిగా మారింది, దానితో పాటు రాష్ట్రానికి ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లభించింది.
అలాగే చిత్తూరు జిల్లాలో శ్రీసిటీ పేరుతో పరిశ్రమలన్నింటిని ఒక్క వేదిక పైకి తీసుకువచ్చారు. ముఖ్యంగా మొబైల్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దారు. ఒకప్పుడు దిగుమతి చేసుకునే ‘రెడ్ మీ’ మొబైల్స్ ను ఏపీలో అసెంబుల్ చేసే విధంగా ప్రోత్సాహకాలు అందించి రాష్ట్రంలో ఆదాయాన్ని సృష్టించారు. ఈ కోవలోనే అతి పెద్ద సోలార్ పార్క్ మరియు వందలాది పరిశ్రమలు నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాల వేదికగా వెలిసాయి.
ఇదంతా కూడా అమరావతికి ఎగువ భాగంలో చేసిన అభివృద్ధి ప్రణాళికలు. ఇక దిగువ భాగంలో… విశాఖపట్టణం వేదికగా ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చేందుకు చేసిన కృషి అనిర్వచనీయం. బెంగళూరు మరియు హైదరాబాద్ లకు అలవాటైపోయిన ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పించి, విశాఖ మరొక వేదికను చేయాలన్న తాపత్రయమే నిన్న, మొన్న వెళ్ళిపోయిన హెచ్.ఎస్.బి.సి వంటి బ్యాంకులు మరియు అనేక ఐటీ కంపెనీలు. ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న సౌలభ్యాలతో ఆక్వా పరిశ్రమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చి ప్రోత్సహించింది.
ఈ అభివృద్ధికి అమరావతికి ఎక్కడా పొంతన లేదు. ఒక రాజధాని అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే విధంగా మరియు ఏదైనా ప్రభుత్వ పనితో ఇతర ప్రాంతాల నుండి ప్రజలు వస్తే, వారు ఇబ్బందులు పడకుండా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలకు వేదికగా అమరావతిని మార్చారు తప్ప, రాజధాని పేరుతో పెట్టుబడులన్నీ అక్కడ పెట్టారని చెప్పడం అవగాహనా లోపమే అనుకోవాలి.
అయితే ఒక్కటి మాత్రం ఒప్పుకుని తీరాలి. దేశం గర్వించే విధంగా… ప్రపంచం మొత్తం ఆకర్షించే విధంగా… అమరావతిని రూపొందించి విశ్వమంతా నగరానికి వచ్చే విధంగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్ష అయితే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ సందర్భాలలో వ్యక్తపరిచారు, అందుకు అనుగుణంగానే కట్టడాల నిర్మాణాలను రూపొందించారు. వాటినే కొంతమంది గ్రాఫిక్స్ అన్నారు.
భారతదేశ గత చరిత్ర చూస్తే ఎన్ని విశేష కట్టడాలను నాడు రాజులు ఎలా నిర్మించారు? అప్పుడు కూడా గ్రాఫిక్స్ అనే పేరుతో అడ్డుకుంటే, వాటి నిర్మాణాలు అయ్యేవా? ఆ సంస్థానాలనే కదా నేడు గ్రాఫిక్స్ రూపంలో మనం అబ్బురపడుతూ చూస్తోంది. నేడు దుబాయ్ వేదికలుగా ప్రపంచ పర్యాటకులు పర్యటించే విధంగా ఆకర్షణీయమైన కట్టడాలు నిర్మితమవుతుంటే, మనం మాత్రం పాత ఇంట్లోనే ఉందామని కోరుకోము కదా! అయితే అలాంటి నిర్మాణాలు చేయలేని వారు, కనీసం అలాంటి ఆలోచనలు కూడా చేయలేని వారు ఉంటారు కదా!



