తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు మలి మిడత ప్రచారం మొదలు పెడుతున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారు కావడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. ఈ నెల 19 నుంచి 25 వరకూ రాష్ట్రంలో నిర్వహించబోతున్న బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు. 19న ఖమ్మం, పాలకుర్తిలో. 20న సిద్ధిపేట, హుజూరాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిలో. 21న జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్ లో సభలుంటాయి.
[m9ad]
22న ఖానాపూర్, ఇచ్చోడ, నిర్మల్, ముధోల్, ఆర్మూర్. 23న నర్సంపేట, మహబుబాబాద్, జనగామ, డోర్నకల్, తుంగతుర్తి, సూర్యపేట, జనగామ. 25న తాండూరు, నారాయణ పేట, పరిగి, షాద్ నగర్, ఇబ్రహింపట్నం, దేవరకద్రల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు.నిజానికి శాసనసభను రద్దు చెయ్యగానే కేసీఆర్ ఒకటి రెండు సభలు పెట్టి చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. 50 రోజులలో 100 సభలకు కేసీఆర్ హాజరు కాబోతున్నారని పార్టీ ప్రకటించింది. కేసీఆర్ స్పీడ్ చూసి ప్రతిపక్షాలు బేజారు అయిపోయాయి.
అయితే ఉన్నఫళంగా కేసీఆర్ మాయం అయిపోయారు. దాదాపుగా నెలకు పైగా ఎర్రవల్లిలోని తన ఫార్మ్ హౌస్ కే పరిమితం అయిపోయారు. అప్పట్లో 50 రోజులలో 100 సభలు అంటే దాదాపుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో కేసీఆర్ సభలు పెడతారు అనే దగ్గర నుండి ఇప్పుడు చివరి నిముషంలో హైరానా పడాల్సి వస్తుంది. అసలు ఇన్ని రోజులు ఫార్మ్ హౌస్ లో కేసీఆర్ ఏం చేసినట్టు? శాసనసభ రద్దు చెయ్యగానే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కాబట్టి ఆ పని కూడా పెద్దగా లేదు. రెబెల్స్ తో మాట్లాడటం వంటివి ఎక్కువగా కేటీఆర్, హరీష్ చూసుకున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ మళ్ళీ ప్రచారం మొదలు పెట్టడంతో తెరాస శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. తొలి విడత ప్రచారంలో పూర్తిగా చంద్రబాబునే టార్గెట్ చేసిన ఆయన ఈసారి ఏం చేస్తారో చూడాలి.



