అన్న మీద వ్యతిరేకతతో, వైసీపీ మీద పంతంతో, వైఎస్ఆర్ పేరు మీద హక్కుతో వైస్ షర్మిల వైస్ జగన్ కు వ్యతిరేకంగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ ఒక పార్టీ అధ్యక్షురాలిగా తెలంగాణ రాజకీయ చదరంగంలోకి దూకింది.
అయితే ఏపీలో జగన్ పతనం కోసం తెలంగాణలో భీజం వేసిన షర్మిల, అటు తెలంగాణ రాజకీయాలను కూడా ప్రభావితం చేయాలనీ భావించారు. అప్పటి అధికార బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ లకు ప్రత్యామ్నాయంగా పాదయాత్ర చేసిన షర్మిల చివరికి తండ్రి కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించిన కాంగ్రెస్ పార్టీ గూటికే చేరింది.
బిఆర్ఎస్ ఓటమి కోసం , తెలంగాణలో కేసీఆర్ దొరల పాలన అంతం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతుంది అంటూ ప్రకటించిన షర్మిల ఆ తరువాత కొన్ని రోజులకే తన వైఎస్ఆర్ టీపీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఏపీ రాజకీయాలలోకి అడుగు పెట్టారు.
ఇక ఆ తరువాత జరిగిన వరుస పరిణామాలన్నీ తనకు అనుకూలంగా లేకపోయినా తన అన్న జగన్ కు వ్యతిరేకంగా మార్చగలిగింది షర్మిల. ఇలా అన్న వదిలిన బాణం లా రాజకీయ తెర మీదకు వచ్చిన షర్మిల తెలంగాణలో తానూ నాటిన భీజం ను ఏపీలో మొలకెత్తేలా చేసి చివరికి అటుతిరిగి ఇటుతిరిగి తన రాజకీయ కథ ను కాంగ్రెస్ లో విలీనం తో ముగించారు.
ఇక ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో కవిత వ్యధ చూస్తున్నా అవే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముందుగా తండ్రి నిస్సహాయతను ప్రశ్నించిన కవిత ఆ తరువాత అన్న నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ గళం వినిపించారు. ఇక ఇప్పుడు జాగృతి పేరు మీద కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ తన భవిష్యత్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుందో అన్న సంకేతాలు పంపిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాలలో కవిత జోరు చూస్తున్నా, బిఆర్ఎస్ పార్టీలో ఆమె హోరు వింటున్న అతి త్వరలో కవిత కూడా తెలంగాణలో తన తండ్రి పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ పార్టీ కూడా షర్మిల స్థాపించిన పార్టీ మాదిరి విలీనం కోసం ఎదురు చూస్తుందా.? లేక సొంత వారిని బెదిరించడం కోసమే పరిమితమవుతుందా.? అనేది కాలమే బదులు చెప్పాలి.




