శాసనసభ ఎన్నికలలో ఏదో పార్టీ గెలిస్తే మిగిలిన పార్టీలు ఓడిపోతాయి లేదా ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అందరికీ తెలుసు. కానీ తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ గెలుస్తాయట! ఇదెలా సాధ్యం? అంటే ఒక్కో సర్వే ఒక్కో రకంగా చెపుతుండటమే.
రాజకీయ పార్టీల మద్య నెలకొన్న ఈ పోటీ కారణంగా అనేక ప్రీ పెయిడ్ సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేశాయి. అవి ఏ పార్టీ డబ్బిస్తే ఆ పార్టీకి అనుకూలంగా సర్వే నివేదికలు ఇచ్చేస్తున్నాయి. దీంతో అసలైన సర్వే నివేదిక ఏదో తెలియని పరిస్థితి నెలకొంది.
కొన్ని సర్వే సంస్థలు బిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని చెపుతుంటే, కొన్ని కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతోందని చెపుతున్నాయి. కనుక వాటి ప్రకారం ఒకే రాష్ట్రంలో రెండు పార్టీలు గెలిచి, అధికారంలోకి రాబోతున్నాయన్న మాట!
తమ పార్టీయే ఎన్నికలలో గెలవబోతోందని ప్రజలకు నమ్మకం కలిగిస్తే చాలు, ప్రత్యర్ధికి ఓట్లు వేయాలనుకొనేవారు కూడా తమ ఓట్లు మురిగిపోకూడదనే ఆలోచనతో తమకే వేస్తారని పార్టీలు భావిస్తూ, ఈ కొత్త ట్రెండ్‌ని అందిపుచ్చుకొన్నాయి.
ఇదేవిదంగా తెలంగాణ అంతటా ఇప్పుడు “ప్రజలు మార్పు కోరుకొంటున్నారు” అనే మాట గట్టిగా వినబడుతోంది. అయితే ఈ మాట ప్రజలు చెప్పడం లేదు. ఎందుకంటే వారికి ఈ మాట చెప్పే అవకాశం ఉండదు. కనుక వారి తరపున కాంగ్రెస్, బీజేపీ, తదితర పార్టీలే గట్టిగా చెప్పేసుకొంటున్నాయి.
“ప్రజలు మార్పు కోరుకొంటున్నారు” అనే ప్రచారం రాష్ట్రమంతటా మారుమోగిపోతుండటంతో, బిఆర్ఎస్ పార్టీ వెంటనే అప్రమత్తమైంది. “మార్పు వద్దు… కారుకే గుద్దు” అంటూ కౌంటర్ ప్రచారం ప్రారంభించాల్సి వచ్చింది.
కానీ ‘ప్రజలు మార్పు కోరుకొంటున్నారనే’ కాంగ్రెస్ ప్రచార వ్యూహం బాగానే ఫలించిన్నట్లుంది. ప్రీ-పెయిడ్ సర్వేలు కూడా ఆ వ్యూహంలో భాగమే కావచ్చు. కానీ తెలంగాణ ప్రజలు నిజంగా మార్పు కోరుకొంటున్నారా లేదా? అనే విషయం డిసెంబర్ 3న ఫలితాలు వెలువడినప్పుడు తెలుస్తుంది.




