సినీ పరిశ్రమలో కొందరు పెద్ద దర్శకులు, కొందరు పెద్ద హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తుంటారు. కనుక వారి సినిమాలు భారీ బడ్జెట్‌తోనే ఉంటాయి. అంటే కథకి అవసరం బట్టి భారీ సెట్టింగ్స్ వేసి, విదేశాల్లో షూటింగ్ చేయడం వల్ల బడ్జెట్ పెరిగిందనుకోలేము. వారు ఇండస్ట్రీలో పెద్దవారు కనుక వారి రేంజ్‌కి ఆ మాత్రం బడ్జెట్, ఖర్చులు అవుతాయని సరిపెట్టుకోక తప్పదు.
కానీ దర్శకులలో అనిల్ రావిపూడి కాస్త డిఫరెంట్! పెద్ద హీరోలతో సినిమాలు చేస్తుంటారు. కానీ భారీ బడ్జెట్ అవసరం లేదు. అది చిరంజీవి సినిమా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అయినా సరే!
నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ జరిగిన కార్యక్రమంలో అనిల్ రావిపూడి ‘సినిమా బడ్జెట్’ లెక్కల గురించి చెప్పిన మాటలు ఆలోచింపజేస్తాయి.
“సాధారణంగా నేను మధ్యతరగతి కుటుంబాలు… నాలుగు గోడల మధ్య సాగే వారి జీవితాలతో ఎక్కువ కనెక్ట్ అవుతాను. కనుక నా సినిమాల కంటెంట్ ఆ స్థాయిలోనే ఉంటుంది. దాని కోసం భారీ సెట్టింగ్స్, విదేశాల్లో సాంగ్ సీక్వెన్స్ అవసరం ఉండవు. కనుక బడ్జెట్ అదుపులో ఉంటుంది.
అటువంటి మధ్యతరగతి ఫ్యామిలీ కథతో సినిమా తీస్తున్నప్పుడు (ఉదా: హీరో బజారుకు వెళ్లి కూరగాయలు తెచ్చే సన్నివేశం ఉంటే దాని కోసం) స్టూడియోలో తారు రోడ్ సెట్టింగ్, మార్కెట్ సెట్స్ వేస్తే చాలా ఖర్చవుతుంది. అయినా దాంతో నేచురల్ ఫీల్ రాదు. అదే ఊర్లో ఉన్న రోడ్‌పై షూట్ చేస్తే తక్కువ ఖర్చవుతుంది. చాలా సహజంగా ఉంటుంది కూడా. కనుక అవసరం ఉంటే తప్ప నిర్మాత చేత డబ్బు ఖర్చు పెట్టించను.
‘సరిలేరు నీకెవ్వరు’ కోసం కొండారెడ్డి బురుజు సెట్, విలన్ సెట్, ఇంకా చాలా సెట్స్ వేయించాను. ఆ సినిమా కోసం నిర్మాత చేత చాలా ఖర్చు పెట్టించాను. ఎందుకంటే ఆ సినిమా కంటెంట్‌కి అది అవసరం కనుక. ఓ దర్శకుడిగా ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో బాగా ఆలోచిస్తాను. కంటెంట్ డిమాండ్ చేయనప్పుడు నిర్మాత చేత ఖర్చు పెట్టించడం చాలా తప్పు.
నేను వీలైనంత తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీయడానికే ఎక్కువ ఇష్టపడతాను. అందువల్లే సినిమా రిలీజ్ అయ్యే సమయానికి నా నిర్మాతలకు కాస్త టేబుల్ ప్రాఫిట్ వస్తుంది. సినిమా కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ఒక రూపాయో, అర్ధ రూపాయో సంపాదించుకోగలుగుతున్నారు. నా సినిమాలతో అందరూ తృప్తి చెందారు… లాభపడ్డారనే సంతోషం నాకు చాలు,” అని అనిల్ రావిపూడి అన్నారు. నిజమే కదా?




