మనోభావాలు దెబ్బ తింటే… దెబ్బలు పడతాయి రాజా

Why ‘Hurt Sentiments’ Are Rising in Telugu Cinema

ముందు తరాలవారికి తెలుగులో ‘మనోభావాలు’ అనే పదం ఒకటి ఉందని తెలియదు. అందుకే సినిమా వాళ్ళు ఎన్ని రకాల సినిమాలు తీసినా, ఎటువంటి డైలాగులు వాడినా ఎవరి మనోభావాలు దెబ్బ తినలేదు.

ఓ కులం, మతం, ప్రాంతం, భాష, ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉన్న పాత్రలు పెట్టినా, వాటిపై వారితో కామెడీ లేదా విలన్‌ వేషాలు వేయించినా ఎవరి మనోభావాలు దెబ్బ తినలేదు.

ADVERTISEMENT

నిజంగా అది తెలుగు భాష అదృష్టమే అనుకోవాలి. లేకుంటే కన్యాశుల్కం, మాయాబజార్, గుండమ్మ కధ, నర్తనశాల వంటి అనే ఆణిముత్యాలు ఉండేవే కావు మనకి.

కానీ ఇప్పుడు నిత్యం ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బ తింటునే ఉన్నాయి. కుర్చీ, బల్ల, కుక్క, పిల్లి. చొక్కా, కాలరు ప్రతీదీ తప్పుగానే వినిపిస్తోంది. మనోభావాలు దెబ్బ తినేస్తున్నాయి.

ముఖ్యంగా సినిమాలు విషయంలో జనాల ‘సెన్సిటివిటీ’ నానాటికీ పెరిగిపోతోందిప్పుడు. మనోభావాలు దెబ్బ తింటే సోషల్ మీడియాలో భీకర యుద్ధాలు మొదలైపోతున్నాయి. రోజూ ఇలా ఎవరో ఒకరి ఈ మనోభావాలు దెబ్బ తింటూనే ఉన్నాయి. కనుక కొన్నిసార్లు పాపం పోలీసులు, న్యాయమూర్తులూ కూడా ఓవర్ టైమ్‌ చేయాల్సివస్తోంది ఈ మనోభావాలు కాపాడటం కోసం.

ఇవన్నీ చూస్తుననప్పుడు ఈ జనాలు మరీ ఇంత సున్నిత మనస్కులు ఎప్పుడయారబ్బా?అనిపించక మానదు. కానీ కుర్చీ, బల్ల, కుక్క, పిల్లీ, చీపురు కట్ట, చొక్కా, కాలర్ అంటేనే బాధపడే సున్నితమైన మనసులు కలిగిన ఈ జనాలు దేశానికి, రాష్ట్రానికి సంబందించిన అనేక అంశాలు, తీవ్రమైన సమస్యలపై స్పందించనప్పుడు ఎందుకు స్పందించరు? అప్పుడు వీళ్ళ మనసులు ఎలా బండబారిపోతాయి?అనిపిస్తుంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, ఈ మనోభావాలకు రాజమౌళి అతీతులు కనుక పట్టించుకోలేదు. కానీ పాపం మారుతి తాను దర్శకుడినే అనుకుంటున్నారు. కనుక పొరపాటున కాలర్ పట్టుకున్నారు. అలాగని ఆయన ఎవరి కాలర్ పట్టుకోలేదు. కానీ ‘ఆ కాలర్ మాదంటే…. కాదు మాదే..’ అనేసుకున్న అభిమానుల మనోభావాలు దెబ్బ తినేశాయి.

కానీ ఆయన చెప్పిన “నా ఈ చిన్న కటౌట్‌కి కాలర్ ఎగరేయడం చాలా పెద్ద మాటే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం నేను రెబెల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. రాజాసాబ్ నన్ను పిలిఛి వచ్చి నా యూనివర్సిటీలో జాయిన్ అవ్వమని చెప్పారు. దానిలో చేరాకనే నాకు దర్శకుడిగా గుర్తింపు వచ్చింది…” అంటూ మారుతి చెప్పిన మాటలు ఎవరూ పట్టించుకోలేదు.

కానీ ‘కాలర్’ అన్నారు కనుక మనోభావాలు దెబ్బ తినేశాయి. కనుక జాడించడం మొదలుపెట్టారు. కనుక ‘కాలర్ టచ్‌ చేసినందుకు’ మారుతి క్షమాపణలు చెప్పుకున్నారు.

కనుక సినిమా వాళ్ళు వేదికలపై తమ మనోభావాలు బయటపెట్టకూడదు. పెడితే ఎవరివో మనోభావాలు దెబ్బ తినేస్తూనే ఉంటాయి. ‘మనోభావాలు దెబ్బ తింటే… దెబ్బలు పడతాయి రాజా’ అని గుర్తుంచుకోవడం చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories