జగన్, కేసీఆర్‌లకు చట్టాలు వర్తించవా? ఏపీలో ప్రభుత్వం మారి 14 నెలలు పూర్తయినా, జగన్ ఒక్కరోజు కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. ఆరు నెలలు దాటితే సభ్యత్వం రద్దవుతుందని తెలిసి ఒకసారి వచ్చి సంతకం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ అసెంబ్లీ మొహం చూడలేదు. ఇక మిగిలిన నాలుగేళ్ళూ కూడా రారని అర్ధమవుతూనే ఉంది.
ఇక్కడ జగన్, అక్కడ తెలంగాణలో కేసీఆర్ ఇద్దరిదీ ఇదే పద్దతి. పదవి, అధికారం ఉన్నప్పుడే అసెంబ్లీకి వస్తాము. లేకుంటే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రజాప్రతినిధులుగా తమ కనీస బాధ్యత నిర్వర్తించకపోయినా ప్రభుత్వం నుంచి ఏడాదికి దాదాపు రూ. 15-16 లక్షల జీతాలు, మాజీ ముఖ్యమంత్రులుగా జెడ్ ప్లస్ భద్రత, సకల సదుపాయాలు ఇద్దరూ ఉపయోగించుకుంటూనే ఉన్నారు.
ఓ ఐఏఎస్, ఐపీఎస్ అధికారి లేదా సామాన్య ఉద్యోగి రోజూ డ్యూటీకి రాకపోతే ప్రభుత్వం జీతం ఇస్తుందా? ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇలా ప్రవర్తిస్తే ఉద్యోగంలో నుంచి పీకేయకుండా ఉంటుందా? మరి జగన్, కేసీఆర్‌లకు మాత్రం ఈ ప్రత్యేక హక్కులు ఎందుకు? వారివురూ ఈ దేశంలోని చట్టాలకు అతీతులా?
అవినీతికి పాల్పడితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులనైనా ఉద్యోగాలలో నుంచి సస్పెండ్ చేసి కేసులు నమోదు చేస్తారు. కానీ జగన్, కేసీఆర్ ఇద్దరిపై అనేక అవినీతి ఆరోపణలున్నా వారిని ప్రభుత్వాలు, ఈ వ్యవస్థలు ఏవీ కనీసం టచ్ చేయలేకపోన్నాయి.
టచ్ చేయలేకపోతే పాయే కనీసం శాసనసభ సమావేశాలకు కూడా రప్పించలేని నిసహాయ స్థితిలో మన ప్రభుత్వాలు, వ్యవస్థలు ఉన్నాయా? —





