పవన్ అంటే పోసానికి ఎందుకంత కోపం?

Why Posani Krishna Murali so angry with Pawan kalyan“భీమ్లా నాయక్” విడుదల సందర్భంగా ఏపీ సర్కార్ తీసుకున్న చర్యలతో పవన్ ఫ్యాన్స్ మరియు సినీ అభిమానులు జగన్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమా హాల్స్ లో జగన్ ను ఉచ్చరిస్తూ ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైనంపై సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. దీంతో ప్రభుత్వం తరపున ఎదురు దాడి చేసేందుకు ఇండస్ట్రీ వ్యక్తి అయిన పోసాని కృష్ణ మురళీ రంగంలోకి దిగారు.

తమ కుటుంబం కరోనాతో బాధపడుతున్న సమయంలో ఏఐజీ హాస్పిటల్ కు సీఎం జగన్ ను ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందించాలని చెప్పినందుకు గాను కృతజ్ఞతలు చెప్పడానికి తాడేపల్లి వచ్చానని చెప్పిన పోసాని, “భీమ్లా నాయక్” సినిమాను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టిందని చెప్పడం సరికాదు, ఒకవేళ సాక్ష్యం ఉంటే చూపించాలని కోరారు.

ADVERTISEMENT

సినిమా టికెట్ ధరలకు సంబంధించి చిన్న నిర్మాతల నుండి ఇంకా ప్రతిపాదనలు అందలేదని, ఆ ప్రతిపాదన వచ్చిన తర్వాతే ధరలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ప్రస్తుతం అయితే టికెట్ ధరలపై ఎలాంటి చర్చ జరపలేదని అన్నారు. వైఎస్ జగన్ పై నిందలు వేసిన వారు 100 అడుగుల లోతుకు పాతుకుపోతారంటూ తనదైన శైలిలో శాపనార్ధాలు పెట్టారు పోసాని.

‘రిపబ్లిక్’ ఈవెంట్ లో పవన్ టికెట్ ధరలపై మాట్లాడినపుడు కూడా బయటకు వచ్చి, పవన్ కళ్యాణ్ పై మరియు ముఖ్యంగా పవన్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసారు పోసాని. అయితే నాటి వ్యాఖ్యలను కనీసం మెగా ఫ్యామిలీ కూడా ఖండించకపోవడం విస్తుపోయే అంశంగా మారగా, మళ్ళీ సరిగ్గా ‘భీమ్లా నాయక్’ రిలీజ్ రోజు వచ్చి జగన్ సర్కార్ ను నెత్తిన పెట్టుకుని, అసలు ఈ సినిమాను అడ్డుకోలేదని పేర్కొనడం విశేషం.

దీనికి ప్రతిగా అభిమానులైతే సోషల్ మీడియా వేదికగా అనేక ఫోటోలను, వీడియోలను పోస్ట్ లు చేస్తున్నారు. ఇవేమి పోసాని కళ్ళకు కనిపించడం లేదా? చెవులకు వినిపించడం లేదా? అంటూ నిలదీస్తున్నారు. సీఎం సొంత జిల్లా అయిన కడపలోని వీడియోలు కూడా ఈ సందర్భంగా ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు. అలాగే ప్రింట్ మీడియా ప్రచురించిన పలు కధనాలను, ప్రభుత్వ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను కూడా పోస్ట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ అనే పాటికి ఒంటికాలిపై పోసాని ఎందుకు వస్తున్నారు? అనేది మాత్రం అర్ధం కాని అంశంగా మారింది. ‘రిపబ్లిక్’ ఈవెంట్ తర్వాత మండిపడిన పోసాని, ఇటీవల చిరంజీవి బృందం తాడేపల్లి వచ్చిన సందర్భంగా కనిపించారు. అయితే అప్పుడేమి మాట్లాడలేదు గానీ, ‘భీమ్లా నాయక్’ రిలీజ్ తర్వాత మళ్ళీ తన నోటికి పని చెప్పడం వెనుక ఆంతర్యం మాత్రం ఫ్యాన్స్ కు అవగతం కావడం లేదు.

ఇదే పోసాని కృష్ణమురళీ మెగాస్టార్ ‘ప్రజారాజ్యం’లో ఉన్నపుడు పవన్ తో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. నాడు ఇద్దరు కలిసి చేయడమే కాక, ఇద్దరూ కూడా సినిమా పరిశ్రమకు చెందిన వారు. పోసానిపై పవన్ ఎప్పుడు బహిరంగంగా విమర్శలు చేయలేదు గానీ, పోసాని మాత్రం ఒక్క పవన్ పైనే కాకుండా, కుటుంబ సభ్యులపైన కూడా తీవ్రంగా విరుచుకుపడిన వైనం తెలిసిందే. అలాగే నేడు ‘భీమ్లా నాయక్’ను పక్కన పెట్టి ప్రభుత్వ తీరును సమర్థిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories