ఏ రంగంలోనైనా ఓ వ్యక్తి వేగంగా ఎదుగుతుంటే సహజంగానే అభిమానులు, శత్రువులు సమాన నిష్పత్తిలో పెరుగుతుంటారు. అభిమానులు తొందరగానే బయటపడుతారు కానీ శత్రువులు సరైన సమయం వచ్చే వరకు బయటపడరు. ఇందుకు తాజా ఉదాహరణగా రాజమౌళిపై వస్తున్న విమర్శలు, నమోదవుతున్న కేసులు కనిపిస్తున్నాయి.
రాజమౌళి ఆస్కార్ అవార్డు సాధించినప్పుడు అందరూ ‘ఆహా ఓహో రాజమౌళి’ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి, భారత్ ఖ్యాతి ప్రపంచదేశాలకు చాటి చెప్పారని అందరూ మెచ్చుకున్నారు. కానీ అదే రాజమౌళి… దేవుడు, భక్తి గురించి తన మనసులో భావాలు బయటపెట్టగానే, ఆయనకు ఎంత మంది శత్రువులున్నారనే విషయం బయటపడింది.
ఇక్కడ ఆయన హిందూమతం గురించి ఏం మాట్లాడారనేది చర్చించబోవడం లేదు. ఒక వ్యక్తి ఆ స్థాయికి ఎదిగితే అతని ప్రమేయం లేకుండానే ఎంత మంది శత్రువులు తయారవుతారనేదే మాట్లాడుకుందాము.
సినీ రంగంలో సెలబ్రెటీలందరూ ఏదో ఓ సందర్భంలో నోరు జారి ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నవారే. కనుకనే రాజమౌళితో సహా అందరూ చాలా ఆచితూచి మాట్లాడుతుంటారు. కానీ మొన్న నోరు జారారు… అనేకంటే తన అభిప్రాయాన్ని చెప్పారనుకోవచ్చు.
అది అందరికీ నచ్చకపోవచ్చు. నచ్చాలని రూల్ లేదు కూడా. కానీ సినీ పరిశ్రమలో, బయట కూడా రాజమౌళి ఎదుగుదల, అయన పేరు ప్రతిష్టలు చూసి అసూయపడేవారు చాలా మందే ఉంటారు. ఆయన వలన పరోక్షంగా నష్టపోయినవారు కూడా ఉండే ఉంటారు.
కనుక వారికి ఆయనే ఈ అవకాశం కల్పించడంతో విమర్శలు మొదలుపెట్టారు. లేకుంటే ఎవరైనా ఆయనని, అయన సినిమాలని ఇంతవరకు ఎవరైనా వేలెత్తి చూపి విమర్శించే సాహసం చేశారా? లేదు కదా? కనుక తనకు కనపడని శత్రువులు ఇంత మంది ఉన్నారనే విషయం రాజమౌళి కూడా గ్రహించారు కనుక ఇక మరింత మరింత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.






