రేవంత్ రెడ్డి ధీమాకు కారణం ఏమిటో?

revanth-reddy-confidence

అధికారంలో ఉన్నవారు ఎప్పటికీ మేమే అధికారంలో ఉండాలని, ఉంటామని చెపుతుంటారు. ముఖ్యమంత్రులు కూడా మరో 10-15 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రులుగా కొనసాగుతామంటారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని నిన్నే చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఎల్లప్పుడూ పదవుల కోసం కుమ్ములాటలు జరుగుతూనే ఉంటాయి. కానీ అయన ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత కుమ్ములాటలు బాగా తగ్గిపోయాయి. పార్టీలో సీనియర్లు సైతం ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే ఇదొక్కటే ఆయన ధీమాకు కారణమని చెప్పలేము. కేసీఆర్‌ ఫామ్‌హౌసులో కూర్చొని ప్రగల్భాలు పలకడమే తప్ప ఇక ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనలేరని అందుకు ఆయన ఆరోగ్యం సహకరించదని ఆయనంతట ఆయనే నిరూపించుకుంటున్నారు.

ఇక బీఆర్ఎస్‌ పార్టీని కేటీఆర్‌ చేతిలో పెట్టినా అయన సమర్ధంగా నడిపించలేకపోతున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని మోడీని విమర్శిస్తూ, ఎద్దేవా చేస్తూ అదే రాజకీయమని కాలక్షేపం చేస్తుంటారు. అదేవిధంగా కేటీఆర్‌ కూడా సిఎం రేవంత్ రెడ్డిని తిడుతూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప పార్టీని సమర్ధంగా నడిపించలేకపోతున్నారు.

బీఆర్ఎస్‌ పార్టీలో హరీష్‌ రావు కట్టప్ప… ఎప్పటికైనా దెబ్బేస్తారని కవిత పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నారు. “ఆమె చేసే విమర్శలు, బయటపెడుతున్న అవినీతి ఆరోపణలు చాలు బీఆర్ఎస్‌ పార్టీని ముంచేయడానికి… మేము వేరేగా విమర్శించాల్సిన అవసరం లేదన్న” మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయం అక్షరాల నిజం. కనుక బీఆర్ఎస్‌ పార్టీ ఇప్పట్లో కోల్కొనే పరిస్థితి కనిపించడం లేదు.

తెలంగాణలో పుంజుకోవడానికి బిజేపి నేతలు ఎటువంటి కృషి చేయకుండా ‘తెలంగాణలో బిజేపి అధికారంలోకి వస్తుంది,’ అని పగటి కలలు కంటూ కాలక్షేపం చేస్తున్నారు. అందువల్లే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో, పంచాయితీ ఎన్నికలలో బిజేపి 3,4 స్థానాలకు పరమితమయ్యింది. అయినా నేటికీ ఈ పగటి కలతో కాలక్షేపం చేస్తూనే ఉన్నారు.

రాష్ట్రంలో బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితి ఈవిధంగా ఉండగా, సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీపై పూర్తి పట్టుసాధించారు. ఒకవేళ కాంగ్రెస్‌ అధిష్టానం ఆయన స్థానంలో మరొకరికి పగ్గాలు అప్పగిస్తే, అప్పుడు బిజేపి, బీఆర్ఎస్‌ పార్టీలు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చావు దెబ్బ తీయగలవు. కనుక వాటిని రేవంత్ రెడ్డి మాత్రమే ఎదుర్కోగలరని కాంగ్రెస్‌ అధిష్టానం నమ్ముతోంది. కనుక అయనని తప్పించే సాహసం చేయలేదు. అందువల్లే మరో 5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని సిఎం రేవంత్ రెడ్డి నమ్మకంగా చెప్పగలుగుతున్నారనుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories