‘తెలుగు భాష’ అనే రెండు పదాలు చూడగానే ‘బోర్’ అంటూ పేజీ తిప్పేస్తుంటారు చాలా మంది. బహుశః దీనిని అలాగే తిప్పేయవచ్చు. కనుక థియేటర్లకు ప్రేక్షకులను రప్పించి, చివరిదాకా కూర్చోబెట్టడం ఎంత కష్టమో… తెలుగు భాష గురించి ఇలాంటి ఆర్టికల్స్ చదివించడమూ అంతే కష్టం. కనుక ‘దీనిలో సినిమాల గురించి కూడా ఉంది…’ అంటూ చిన్న ఎర వేయక తప్పడం లేదు.
మన భాష పట్ల మనకి చిన్న చూపు, ఇంగ్లీషు భాషపై మోజు చాలా కామన్. ఎంత మోజంటే కుక్కలతో కూడా మనం ఇంగ్లీషులోనే మాట్లాడుతుంటాము. అంటే మనం నేర్చుకోవడమే కాకుండా వాటికీ ఇంగ్లీషు నేర్పిస్తున్నామనుకోవచ్చు.
మన భాషాభిమానం ఇలా ఉంటే, తమిళ, కన్నడ, మళయాళీలు మాత్రం తమ భాషే తమకు ముఖ్యం… గౌరవం… అదే ప్రత్యేక గుర్తింపునిస్తుందని గట్టిగా నమ్ముతారు.
వారి భాషాభిమానాన్ని దేనితోను కొలవలేము. కొలవాలనుకుంటే మన భాషాభిమానంతో పోల్చుకొని కొలుచుకోవలసిందే.
ఉదాహరణకు తమిళ, కన్నడ, మళయాళ సినిమాలకు చాలా వరకు వారి భాషల్లోనే పేర్లు పెట్టుకుంటారు. అలాగే వారి భాషలను, సంస్కృతీ సంప్రదాయాలు, జీవనశైలిని యధాతధంగా సినిమాలలో చూపిస్తుంటారు. ముఖ్యంగా తమిళ్, మళయాళ భాషలలో కనిపించే ‘నేటివిటీ’ మన తెలుగు సినిమాలలో కనిపించదు… అంటే అభిమానులకు ఆగ్రహం కలుగుతుంది.
సరే మనకి భాషాభిమానం తక్కువ… అందుకు ఎవరూ బాధపడం కూడా. అంతేకాదు.. వారి భాషాభిమానాన్ని కూడా యధాతధంగా అంగీకరించేస్తున్న విశాల హృదయాలు మనవి.
అందుకే తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు వారి భాషలలో పేర్లతోనే తెలుగులో విడుదల చేస్తున్నా చూసి ఆనందిస్తున్నాము… తప్ప కనీసం సినిమా పేరు తెలుగులో ఉండాలని ప్రజలు, ప్రభుత్వం ఎవరూ కోరుకోవడం లేదు.
కనుక తమిళ సినిమాలు తమిళ పేర్లతోనే తెలుగులో వచ్చేస్తున్నాయి. వాటి అర్ధం మనకి అనవసరం ఒకవేళ తెలుసుకోవాలనుకునేవారు గూగుల్లో వెతికి తెలుసుకొని ‘ఓహ్ దీనికి ఇంత గొప్ప అర్ధం ఉందా?” అని మెచ్చుకుంటారు కూడా!
కానీ మన తెలుగు సినిమాలు ఇప్పుడు నేషనల్ లెవెల్ దాటి ఇంటర్నేషనల్ లెవెల్‌కి వెళ్ళిపోవాలని టార్గెట్ పెట్టుకున్నాయి.
కనుక నేతి బీరకాయలో నెయ్యి కోసం వెతకడం అవివేకమన్నట్లే తెలుగు సినిమాలలో తెలుగు, నేటివిటీ కోసం వెతకడం, బాధపడటం మానేసి చాలా కాలమే అయింది.
మన సినిమాలు వెయ్యో రెండు వేల కోట్లో కలెక్షన్స్ సాధిస్తే చాలు… మనం గెలిచేసినట్లే… చొక్కాలు చించేసుకొని మరీ పండగ చేసుకుంటాము! దటీజ్ తెలుగూస్!






