రేవంత్‌ ఉచ్చులో నుంచి కేసీఆర్‌ బయటపడగలరా?

KCR-Revanth

ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటామనే గుడ్డి నమ్మకంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడితే ఏమవుతుందో తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ ఆయన కుటుంబ సభ్యులు రాబోయే రోజుల్లో ఎదుర్కొబోయే కేసులు తెలియజెప్పబోతున్నాయి.

సాగునీటి వనరులు, విద్యుత్, పర్యాటక, పౌరసరఫరా శాఖలలో భారీగా అప్పులు, అవినీతి జరిగిన్నట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్‌, రైతుబంధులను అడ్డం పెట్టుకొని కేసీఆర్ మొదలుకొని బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు అందరూ అందినకాడికి దోచుకొన్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది.

ADVERTISEMENT

ప్రపంచంలో కెల్లా మహాద్భుతమైన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు తదితర బిఆర్ఎస్ నేతలు చాలా గొప్పగా చెప్పుకొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో మొట్టమొదటి మేడిగడ్డ బ్యారేజ్‌లోని 7వ బ్లాక్‌లో కొంత భాగం క్రుంగిపోయింది.

కనుక మేడిగడ్డతో సహా కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని బ్యారేజిలకు సంబందించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సిఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని చెప్పారు.

మేడిగడ్డ బ్యారేజ్ క్రుంగిపోవడంపై సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్‌ నేత నిరంజన్ రెడ్డి హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. దానిపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు సిఎస్ శాంతికుమారిని ఆదేశించింది.

మరోపక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ అధికారులు కూడా వచ్చి క్రుంగిన మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అంటే కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులను, పార్టీ నేతలను అవినీతి చట్రంలో బిగించడానికి ఇదొక్కటే సరిపోతుందని అర్దమవుతూనే ఉంది.

ధరణి పోర్టల్‌ ద్వారా కూడా బిఆర్ఎస్ నేతలు వేల ఎకరాలు తమ పేరిట బదలాయించుకొన్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే ధరణి పోర్టల్‌ రద్దు చేస్తామని పదేపదే చెప్పింది. అయితే ఈ భూబదలాయింపులు ఏవిదంగా జరిగాయో తెలుసుకొనేందుకు ఫోరెన్‌సిక్ ల్యాబరేటరీ ద్వారా శాస్త్రీయంగా, సాంకేతిక సాక్ష్యాధారాలను కనుగొనాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.

తద్వారా ఎక్కడి నుంచి ఎవరు ఎప్పుడు ఎంత భూమిని ఎవరి పేరిట బదలాయించుకొన్నారు?అనే విషయం బయటపడుతుంది. ఒకవేళ కాంగ్రెస్‌ నేతలు అనుమానిస్తున్నట్లు బిఆర్ఎస్ నేతలు అక్రమంగా ప్రభుత్వ, అసైన్డ్ లేదా ఇతర భూములను తమ పేరిట బదిలీ చేయించుకొన్నట్లు తేలితే, దాంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీకి రాజకీయ సమాధి కట్టేయకుండా విడిచిపెట్టదు. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌ కుటుంబ సభ్యులను, బిఆర్ఎస్ నేతలను శాస్త్ర ప్రకారమే రౌండప్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందని స్పష్టమవుతోంది. రేవంత్‌ ప్రభుత్వం సిద్దం చేస్తున్న ఈ ఉచ్చులో నుంచి కేసీఆర్‌, బిఆర్ఎస్‌ నేతలు బయటపడగలరా?

ADVERTISEMENT
Latest Stories