తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో రాష్ట్రానికి బిఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష.. దాని అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని పదేపదే చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రజలే బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు!
గతంలో కేసీఆర్ నేను తప్ప మరెవరూ తెలంగాణను అభివృద్ధి చేయలేరు. నాకు తప్ప మరెవరికీ తెలంగాణ గురించి అవగాహన, నిబద్దత లేదన్నట్లు గొప్పగా చెప్పుకునేవారు. నేటికీ అలాగే చెప్పుకొంటున్నారు కూడా. అయితే కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఈ నాలుగు నెలల్లోనే బిఆర్ఎస్ పార్టీని సగం ఖాళీ చేసేయడంతో, ఇప్పుడు కేసీఆర్‌కు ప్రజలు గుర్తువచ్చారు.
ఎన్నడూ ప్రగతి భవన్, ఫామ్‌హౌస్ విడిచి బయటకు రాని కేసీఆర్ ఇప్పుడు ఎండలను లెక్కచేయకుండా రైతుల వద్దకు వెళ్ళి పలకరించివస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసేందుకు ఇష్టపడని కేసీఆర్ ఇప్పుడు పార్టీలో ద్వితీయశ్రేణి నాయకులని పిలిచి లేదా ఫోన్లు చేసి మరీ మాట్లాడుతున్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఎలాగైనా పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని అభ్యర్ధిస్తున్నారు.
ఒకే ఒక్క ఓటమితో ఇంత మార్పా? అని ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. కానీ కేసీఆర్‌లో కనబడుతున్న ఈ మార్పులు కూడా ఆయన వ్యూహంలో భాగమే అని వేరే చెప్పక్కరలేదు. ఆయన సమస్యల నుంచి బయటపడి మళ్ళీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఇప్పటి కేసీఆర్‌లో నుంచి పాత కేసీఆర్ మళ్ళీ బయటకు వస్తారని వేరే చెప్పక్కరలేదు.
అయితే కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాల కంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకొంటున్న స్వయంకృతాపరాధాల వలననే కేసీఆర్‌కు మళ్ళీ అధికారం లభించే అవకాశమే ఎక్కువగా కనబడుతోంది.
అంటే కేసీఆర్‌ని ఓడించి మూల కూర్చోపెట్టిన కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ ఆయనను గెలిపించి ముఖ్యమంత్రిని చేయవచ్చన్న మాట! అంతవరకు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవలసి ఉంటుంది లేదా ఆయనను, బిఆర్ఎస్ పార్టీని ప్రజలే కాపాడుకోవాలి.




