నిన్న గాక మొన్న వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తీస్తున్న సినిమా ‘యాత్ర’ ఫిబ్రవరి 8న విడుదల కాబోతుందని ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అయితే వెనువెంటనే నందమూరి బాలకృష్ణ హీరోగా తీస్తున్న ఎన్టీఆర్ చిత్ర నిర్మాతలు తమ చిత్రం యొక్క రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఫిబ్రవరి 7కు వాయిదా పడింది అని ప్రకటించడం విశేషం. గతంలో జనవరి 24న ఈ సినిమా విడుదల చెయ్యాలి అనుకున్నా మొదటి భాగంకు నెల రోజుల దూరం ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
[m9ad]
అయితే ఇది ఇప్పుడు ఇద్దరు పెద్ద నాయకుల జీవితచరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాల మధ్య బాక్స్ ఆఫీసు వద్ద పోరాటంగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎన్టీఆర్, వైఎస్సాఆర్ తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసిన నాయకులు. అనేక ప్రజాకర్షక కార్యక్రమాలతో పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ క్రమంలో కాలం చేసిన ఇద్దరు నేతలు దివి నుండి భువికి దిగి వచ్చి పోటీ పడబోతున్నారా అనేది ఆసక్తికరంగా మారబోతుంది. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరలో ఉండటంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారబోతుంది.
ఎన్టీఆర్ సినిమా టీడీపీకి అనుకూలంగానూ, యాత్ర వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండో సారి అధికారంలోకి రావడానికి టీడీపీ, మొదటి సారి సీఎం పీఠం ఎక్కడానికి జగన్ తహతహలాడుతున్నారు. అయితే సినిమా పరిభాషలో బాలకృష్ణ వంటి స్టార్ హీరో ఉన్న ఎన్టీఆర్ పెద్ద సినిమా, మమ్మూటి వంటి పెద్ద హీరో ఉన్నప్పటికీ యాత్ర చిన్న సినిమానే. ఈ క్రమంలో ఎన్టీఆర్ మహానాయకుడుతో పోటీ పడటానికి యాత్ర నిర్మాతలు సాహసం చేస్తారో లేదో చూడాలి.



