పోసానికి ఏం చెప్పారో… ఏం మాట్లాడారో!

Posani Krishna Murali

సలహాదారు అంటే సలహా చెప్పేవాడని అర్దం. కానీ జగన్‌ ప్రభుత్వం దాని అర్దం, పరమార్ధాలనే మార్చేసింది. పార్టీలో రాజకీయ నిరుద్యోగులను, వివిద కారణాలతో నియమించుకున్న సలహాదారులు ప్రభుత్వానికి, సిఎం జగన్మోహన్‌ రెడ్డికి ఏనాడైనా సలహాలు చెప్పారో లేదో అసలు తాడేపల్లి ప్యాలస్‌లోకి అడుగుపెట్టారో లేదో తెలీదు.

కానీ అధిష్టానం నుంచి సిగ్నల్ రాగానే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌, దగ్గుబాటి పురందేశ్వరి, వైఎస్ షర్మిల, సునీతారెడ్డి, రామోజీరావు, వేమూరి రాధాకృష్ణలను తిట్టిపోయడమే తమ పని అన్నట్లు వ్యవహరిస్తుంటారు.

ADVERTISEMENT

ఈమాత్రం దానికి వారికి సలహాదారు పదవులు, వాటి కోసం లక్షల రూపాయల జీతభత్యాలు ఎందుకని అనిపించక మానదు. ఇంతకంటే నెలకు రూ.5,000 జీతాలకే ఇటు వైసీపికి, అటు ప్రజలకు కూడా సేవ చేస్తున్న వాలంటీర్లే తమ ఉద్యోగాలకు న్యాయం చేస్తున్నారు కదా?

ఓ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈరోజూ మీడియా ముందుకు వచ్చి రామోజీరావు-మార్గదర్శి కేసులు, వాలంటీర్ల విషయంలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే, మరో సలహాదారు పోసాని కృష్ణ మురళి కూడా వచ్చి, నటి జయప్రద, లక్ష్మీ పార్వతి జీవితాలు నాశనం అయిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని తిట్టిపోశారు. పనిలో పనిగా నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌ల గురించి కూడా నోటికి వచ్చిన్నట్లు వాగారు. వీరెవరికీ మహిళలంటే గౌరవం లేదని, మహిళలంటే చాలా చులకన అని చొక్కాని సర్దుకొంటూ పోసాని జడ్జిమెంట్ ఇచ్చేశారు.

అయితే ఆయన చెప్పని కొన్ని విషయాల గురించి నెటిజన్స్ వెంటనే కామెంట్స్ రూపంలో చెప్పేశారు.

మీ జగన్మోహన్‌ రెడ్డికి తల్లి, చెల్లి అంటే గౌరవం ఉందా? ఉంటే బయటకు పంపించేసేవారా? వైఎస్ షర్మిల, సునీతా రెడ్డి ఇద్దరూ ప్రజల ఎదుట మా అన్నయ్య మమ్మల్ని మోసం చేశాడని కన్నీళ్ళు పెట్టుకొంటున్నారు మీకు తెలీదా పోసానిగారు? అంటూ నిలదీస్తున్నారు.

ఇంకా గంటా, అరగంట, పావుగంట మంత్రుల రాసలీలలు గురించి మీకు తెలియవా? అని అడుగుతున్నారు. అందుకే అద్దాల మేడలో కూర్చొని దారిన పోయే వారి మీద రాళ్ళు విసరకూడడంటారు. ఒకప్పుడు సినిమాలకు కధలు వ్రాసిన పోసానికి కనీసం ఇంత చిన్న విషయం కూడా తెలియకపోతే ఎలా? అని నెటిజన్స్ అడుగుతున్నారు. ఇంతకీ వైసీపి అధిష్టానం ఏమి మాట్లాడమని చెప్పిందో తెలీదు కానీ ఆయన మాట్లాడిన ఈ మాటలకు మళ్ళీ వైసీపియే జవాబులు చెప్పుకోవలసి వస్తోంది.

ADVERTISEMENT
Latest Stories