వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు అన్ని వివాదాస్పద నిర్ణయాలకే మొగ్గు చూపింది. అందులో ఒకటి సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు ఒకటి. పేదవాడికి అందుబాటులో సినిమా టికెట్ల ధరలు ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని జగన్ నిర్ణయాన్ని వెనకేసుకొచ్చిన వైకాపా నాయకులు, వైసీపీ మంత్రులు మరి ధరలు పెంచుతూ పేదవాడికి దూరం చేసిన వెంకన్న సేవలను ప్రశ్నించకపోవడం విడ్డురంగా మారింది.
అసలు విషయాన్ని వస్తే.., వైసీపీ పార్టీ తన గెలుపు కోసం 2019 ఎన్నికలలో యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వంటి సినిమాలను తీసి వాటిని తన పార్టీ ప్రచారానికి వాడుకుని అధికారం సాధించిన వెంటనే అదే సినీ పరిశ్రమ మీద ఉక్కు పాదం మోపింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు సమయం ఆసన్నమవడంతో తిరిగి అదే సినిమాలను నమ్ముకుని యాత్ర-2 , వ్యూహం,శపథం అంటూ వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది.
పవన్ తన భీమ్లా నాయక్ సినిమా టికెట్లను కొన్ని ప్రాంతాలలో 5 రూపాయలు చేసి అధికారుల సాయంతో అమ్మకాలు చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం అని పలు సభలలో వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ వైసీపీ మద్దతుదారుల సినిమా టికెట్లను కూడా అదే ధరకు పేదలకు అందుబాటులో ఉంచగలరా..?అంటూ ప్రశ్నిస్తున్నారు పవన్ అభిమానులు.
రాంగోపాల్ సినిమాకు ఫ్రీగా టికెట్లు ఇచ్చినా వెళ్లే సాహసం ఎవ్వరు చేయరని ఇప్పటికే అది పలు సినిమాల ద్వారా ఆయన నిరూపించుకున్నారని ఇప్పుడు వ్యూహానికి అదే పరిస్థితి వస్తుందని జోస్యం చెపుతున్నారు టీడీపీ, జనసేన మద్దతుదారులు. అలాగే జగన్ పాలన విధానాలు తెలియని రోజులలో ఆయన సినిమా వ్యూహాలు పనిచేసాయి కానీ ఇప్పుడు జగన్ మీద ప్రజలలో ఉన్న వ్యతిరేకతను సినిమాలతో ఏమార్చలేరని, వైసీపీ రచిస్తున్న శపథాలు ఏపీలో పారవని కుండబద్దలు కొడుతున్నారు వైసీపీ వ్యతిరేకవర్గీయులు.




