వివేకా ఆత్మ వైసీపీని వెంటాడుతోందా?

YS_Avinash_Reddy_Father_YS_Bhaskar_Reddy.jpgగత ఎన్నికలలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని టిడిపి మెడకు చుట్టేసి వైసీపీ లబ్ధి పొందగలిగింది. కానీ ఇప్పుడు అదే కేసు వైసీపీ మెడకు చుట్టుకోవడం వైసీపీ భాషలో ‘దేవుడి స్క్రిప్ట్’ అనే అనుకోవాలేమో? అవినాష్ రెడ్డికి సజ్జల క్లీన్ చిట్ ఇచ్చేసి నిర్ధోషిగా తీర్పు చెప్పేశారు కానీ వివేకా కేసు మాత్రం భూతంలా వైసీపీ నేతలను వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో మరో కీలక పాత్రధారిగా సీబీఐ పేర్కొన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసు పంపి ఫిభ్రవరి 23న కడప సెంట్రల్ జైలులో విచారణకు హాజరు కావలసిందిగా కోరారు. కానీ ఆరోజు తనకు వేరే పనులున్నందున విచారణకు రాలేనని తర్వాత ఎప్పుడైనా వస్తానని భాస్కర్ రెడ్డి చెప్పారు.

కనుక మార్చి 12న కడప సెంట్రల్ జైలులో విచారణకి హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది. ఈసారి సీబీఐ అధికారులు స్వయంగా పులివెందులలో ఆయన నివాసానికి వెళ్ళి నోటీసు అందించి వచ్చారు. కనుక ఈసారి హాజరుకాక తప్పదు. వివేకా హత్యలో ప్రధాన నిందితుడు యాదాటి సునీల్ యాదవ్ బెయిల్‌ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిగినప్పుడు, అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ హత్యకి కుట్ర పన్నారని, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వారి ప్లాన్ అమలుచేశారని సీబీఐ తెలియజేసింది. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ హత్యని గుండెపోటుగా చిత్రీకరించారని, వివేకా ఇంట్లో సాక్ష్యాధారాలని (రక్తపు మరకలు, హత్యకి ఉపయోగించిన గొడ్డలి)ని మాయం చేసేందుకు తోడ్పడ్డారని సీబీఐ ఆరోపించింది.

ADVERTISEMENT

కనుక ఈ కేసులో నిందితులందరికీ సజ్జల రామకృష్ణారెడ్డి క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నప్పటికీ సీబీఐ మాత్రం వారి వెంటపడుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఈ కేసు విచారణ కీలకదశకు చేరుకోబోతోంది. కనుక గత ఎన్నికలలో వైసీపీకి లబ్ధి చేకూర్చిన ఈ కేసే వచ్చే ఎన్నికలలో వైసీపీ మెడకి గుదిబండగా చుట్టుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఇది కూడా ‘దేవుడి స్క్రిప్ట్’ అని సరిపెట్టుకోక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories