క్రెడిట్ నాది… అసమర్దత, వైఫల్యలు మన అందరివీ!

CM YS Jagan About Rajol Project

జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా ఉందని, దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పుకుంటుంది. కానీ రాష్ట్రాభివృద్ధి చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పాకిస్తాన్, శ్రీలంకలా దివాళా తీయబోతోందని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. కనుక ముఖ్యమంత్రి జగన్, ఆర్ధిక మంత్రి బుగ్గన చెప్పినదాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బందులు లేవన్న మాట!

అయితే నిన్న కడప జిల్లా మైదుకూరులో వైసీపి ఎంపీ అభ్యర్ధి అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్ధి రఘురామ రెడ్డి తరపున జగన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు స్వయంగా చెప్పిన మాటలు వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

ADVERTISEMENT

వైఎస్ షర్మిలని జగన్‌ నోరారా ‘చెల్లి’ అని పిలుస్తారో లేదో తెలీదు కానీ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని మాత్రం నోరారా ‘తమ్ముడు… నా తమ్ముడు’ అంటూ ప్రజలకు పరిచయం చేశారు. పైగా ‘మంచి మనసున్నవాడు, యువకుడు, ఉత్సాహవంతుడు…’ అంటూ తమ్ముడు గుణగుణాలు వర్ణిస్తూ ‘ఇలాంటివాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని’ జగన్‌ చెప్పుకోవడం చూసి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా కడప ప్రజలు ఏమనుకున్నారో?

ఎవరైనా ఎన్నికలలో తమ ప్రభుత్వం చేసిన పనుల గురించి చెప్పుకొని ప్రజలను ఓట్లు అడుగుతుంటారు. కానీ జగన్‌ మాత్రం ‘రాజోలు ప్రాజెక్టుకు మేము శంకుస్థాపన చేశాము. కానీ కరోనా వలన, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగోలేకపోవడం వలన, ఇంకా చెప్పకూడని అనేక కారణాల వలన ఈ ప్రాజెక్టుని పూర్తి చేయలేకపోయాము’ అని చెప్పుకొని ‘మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే వచ్చే ‘టర్మ్’లో తప్పకుండా ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని’ జగన్మోహన్‌ రెడ్డి చెప్పారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేయకుండా మళ్ళీ గెలిపిస్తే తప్పకుండా పూర్తి చేస్తామని చెపితే ప్రజలు నమ్ముతారా?

అంతేగాదు… ఈ సందర్భంగా తమ ప్రభుత్వం ఎంత అనాలోచితంగా వ్యవహరిస్తుందో కూడా ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా చెప్పుకోవడం విశేషం.

“గత నాలుగేళ్ళు భారీగా వర్షాలు పడటం వలన ప్రాజెక్టులన్నీ నిండాయి. కనుక అప్పుడు రాజోలు ప్రాజెక్టు అవసరం, ప్రాముఖ్యత మేము గుర్తించలేకపోయాము. కానీ ఈ ఏడాది వర్షాలు పడకపోవడంతో దాని విలువ, అవసరం తెలిసుకున్నాము,” అని చెప్పుకున్నారు.

గోదావరికి వరదలు వస్తే ఆ నీటిని కూడా వృధా కాకూడదని చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తే, రాయలసీమకు త్రాగుసాగు నీటికి ఎంత కటకటలాడుతోందో తెలిసీ, రాజోలిని పూర్తి చేయకుండా వదిలేసి, మళ్ళీ గెలిపిస్తే పూర్తి చేస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా?

ఇంతకీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివ్యంగా ఉందని చెప్పడం అబద్దమనుకోవాలా లేక ప్రాజెక్టు పూర్తి చేయడానికి డబ్బు లేదని చెప్పడం అబద్దమనుకోవాలా? జగన్‌ ప్రభుత్వం ఐదేళ్ళుగా అభివృద్ధి పనులను పట్టించుకోకుండా సంక్షేమ పధకాలతో వైసీపి ఓటు బ్యాంక్ పెంచుకోవడంపైనే దృష్టి పెట్టడం వలననే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పనులు ఎన్నో అర్దాంతరంగా నిలిచిపోయాయి. అందుకు పూర్తి బాధ్యత వహించాల్సిన సిఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రకృతిని, కరోనా మహమ్మారిని సాకుగా చూపడాన్ని ఏమనుకోవాలి?

ADVERTISEMENT
Latest Stories