ఏపీలో వైసీపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంతా వైసీపి రంగులతో నింపేశారు. రాష్ట్రంలో అంతటా వైసీపి రంగులు, జగన్ బొమ్మలే కనిపిస్తుంటే వాటితో ప్రజలు ‘హిప్నటైజ్’ అయిపోయి గుడ్డిగా వైసీపికే ఓట్లు వేసేస్తారని వైసీపి మేధావులు భావించారేమో?
అయితే ‘అతి’ ఎప్పుడూ వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంటుంది. ప్రతీ విషయంలో అతి ప్రదర్శించే వైసీపికే ఈ విషయం బాగా తెలుసు. అయినప్పటికీ వైసీపికి ఈ రంగులు, బొమ్మల పిచ్చి తగ్గలేదు.
వైసీపికి ఎన్నికలలో ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకున్న ఈ పిచ్చినే టిడిపి, జనసేన బలమైన ఆయుధంగా మార్చుకొని వైసీపిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుండటం విశేషం.
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’, పాసు పుస్తకాలపై జగన్ బొమ్మలు పొలాలలో వైసీపి సర్వే రాళ్ళ గురించి టిడిపి, జనసేనల వాదనలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. “నిజమే… మా తాత తండ్రుల నుంచి మాకు వచ్చిన భూములలో మీ వైసీపి సర్వే రాళ్ళు దేనికి?మా స్థిరాస్థి పత్రాలు, పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ దేనికి? వెటన్నిటి వెనుక మర్మమేమిటి?” అని ప్రశ్నిస్తున్నారు.
వైసీపి ‘సంక్షేమ ఓటు బ్యాంక్’ అంతా ప్రధానంగా గ్రామాలలోనే ఉంది. ఇప్పుడు వారే ఎన్నికల ప్రచారానికి వస్తున్న వీటి గురించి నిలదీసి ప్రశ్నిస్తుండటం వైసీపి నేతలు తడబడుతున్నారు. వైసీపిలో మంత్రి స్థాయిలో ఉన్నవారికే వారి శాఖల గురించి పూర్తి అవగాహన లేదు. ఎలాగో టికెట్ దక్కించుకున్న వైసీపి అభ్యర్ధులు ఈ ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ గురించి ఏమి చెప్పగలరు?కనుక తడబడుతున్నారు. వారి తడబాటు గ్రామాలలో ప్రజలకు మరింత అనుమానం కలిగిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా వ్యూహాలు అమలుచేస్తుంటారని ఇంతకాలం గుడ్డి భ్రమలో ఉన్న వైసీపి అభ్యర్ధులు, పోలింగ్‌కు పది రోజుల ముందు టిడిపి ప్రయోగించిన ఈ అస్త్రానికి విలవిలలాడుతున్నారు. జగన్ బొమ్మతోనే ఈ ఎన్నికలలో అవలీలగా గెలిచేస్తామని భ్రమలో ఉన్న వైసీపి అభ్యర్ధులు ఇప్పుడు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మే తమకు శాపంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు!
ఇటువంటప్పుడు గట్టిగా సమాధానం చెప్పాల్సిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు “జగన్మోహన్ రెడ్డి పేదలకు భూములు ఇస్తారే తప్ప ఎన్నడూ లాక్కోరు. టిడిపి, జనసేనలు దుష్ప్రచారాన్ని నమ్మకండి,” అంటూ మొక్కుబడి ప్రకటన చేశారు.
ఈ వివాదం గురించి టిడిపి, జనసేనలు అనేక ప్రశ్నలు అడుగుతుంటే, జగన్మోహన్ రెడ్డి మొదలు పోసాని వరకు అందరూ “జగన్మోహన్ రెడ్డికి పేదలకు భూములు ఇవ్వడమే తెలుసు తప్ప గుంజుకోవడం తెలీదు,” అంటూ అందరూ ఒకటే పాట పాడుతున్నారు తప్ప వీటి గురించి కనీసం రైతుల ప్రశ్నలకు ఎవరూ మాధానం చెప్పలేకపోతున్నారు.
గ్రామీణ రైతాంగం కూడా టిడిపి, జనసేనల వాదనలు ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతలు కొండలు, గుట్టలు, చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తుండటం, అందిన కాడికి ఇసుక, మట్టి, గ్రానైట్ అన్నీ తవ్వేసుకుంటుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక తమ భూములను కాపాడేందుకే జగన్ ప్రభుత్వం ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ తెచ్చిందంటే ఎవరూ నమ్మడం లేదు.
“టిడిపి, జనసేనలు చెపుతున్నవన్నీ అబద్దాలే” అని వైసీపి నేతలు చెప్పబోతే “అయితే నిజాలు ఏమిటి?” అని ప్రజలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ నిజలేమిటో తెలుసుకొని చెప్పేంత సమయం లేదు వాళ్ళకు. కనుక ఈ ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ వైసీపి కొంప ముంచబోతున్నట్లే ఉందని ఆందోళన చెందుతున్నారు.




