ప్రస్తుతం కడప జిల్లాలో పర్యటిస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన సొంత నియోజకవర్గం పులివెందులలో డాక్టర్ వైఎస్సార్ బస్ టెర్మినల్‌కి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మరో జ్ఞాన గుళికని ప్రజలకి ప్రసాదించారు. అదేమంటే తన ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా, ఎన్ని సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నా చంద్రబాబు నాయుడు, దత్త పుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 న్యూస్ ఛానల్స్ కలిసి పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్లాసులో 75 శాతం నీళ్లున్నా అసలు నీళ్ళే లేవని వారు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అటువంటి చెడిపోయిన వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నామని సిఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వం కంటే మనం తక్కువ అప్పులు చేసి ఎక్కువ సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నామని సిఎం జగన్ అన్నారు.
అసలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయని అందరికీ తెలుసు. పోలీస్ వ్యవస్థ వైసీపీ నేతల కనుసన్నలలో పనిచేస్తూ టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలని, అమరావతి కోసం ఆందోళన చేసి, అరసవెల్లికి పాదయాత్ర చేస్తున్న రైతులని ఎంతగా వేదించిందో, పవన్ కళ్యాణ్‌ని హోటల్ గదిలో నుంచి బయటకు రాకుండా ఏవిదంగా నిర్బందించిందో అందరూ చూశారు.
చక్కగా పనిచేస్తున్న విద్యావ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాలతో ఉపాద్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోవడంతో వారు రోడ్లెక్కి ఆందోళన చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. యూనివర్సిటీల పేర్లు మార్చడం, యూనివర్సిటీలలోకి రాజకీయాలు చొప్పిస్తుండటంతో అక్కడా ఇదివరకు లేని సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
మునిసిపల్, రెవెన్యూ వ్యవస్థలకి సమాంతరంగా సచివాలయ వ్యవస్థని సృష్టించడంతో అవీ దెబ్బ తింటున్నాయి. తిరుమల తదితర పుణ్యక్షేత్రాలలో జరుగుతున్న అపచారాలను, హుండీ ఆదాయాలని ప్రభుత్వం వాడుకోవడం చూసి హిందువులు బాధపడుతున్నారు. ఇలా చెప్పుకొంటూపోతే చాలా పెద్ద జాబితాయే ఉంది.
గ్లాసులో సగమైన నీళ్లున్నట్లయితే మిగిలిన సగం ఖాళీ అని చెప్పవచ్చు. కానీ కాళీగా ఉన్న గ్లాసు నిండుగా ఉందని చెపితే అది మభ్యపెట్టడమే కదా?గత మూడున్నరేళ్ళుగా రాష్ట్రంలో సంక్షేమ పధకాల గోల తప్ప ఏనాడు పారిశ్రామికాభివృద్ధి, ఆర్ధికాభివృద్ధి గురించి వైసీపీ నేతల నోట వినబడటం లేదు. వైసీపీ ప్రభుత్వం నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే ప్రజలే ఆ మాట చెప్పుకొంటారు కదా?కానీ చేయలేకపోయింది కనుక ప్రతిపక్షాలు వేలెత్తి చూపిస్తున్నాయి. తప్పులు జరుగుతున్నప్పుడు హెచ్చరించేవారిని ‘విజిల్ బ్లోవర్స్’ అంటారు కానీ సిఎం జగన్ చెడిపోయిన వ్యవస్థ అంటున్నారు!



