ప్రధాన ప్రతిపక్షం వైఎస్సాఆర్ కాంగ్రెస్ అసెంబ్లీని కొద్ది కాలంగా బహిష్కరించడంతో సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో వైకాపా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సెప్టెంబరు 3న శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. పాదయాత్ర జరిగే ప్రాంతం ఇందుకు వేదిక కానుంది.
[m9ad]
కార్యక్రమంలో సెప్టెంబరు 6 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడమా? మానడమా? అనే అంశమే ప్రధాన అజెండా కానుంది. దీనితోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేస్తారనే ప్రచారమూ నడుస్తోంది. అయితే వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఎన్నికల వేళ నియోజకవర్గంలో పట్టు కోల్పోవడం తప్ప అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఎంపీల రాజీనామాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణాలో పార్టీ పోటీ చెయ్యాలా వద్దా అనే దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ముందు ఈ సమావేశం 2న నిర్వహించాలనుకున్నా వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి ఉండటంతో 3న సమావేశం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అనుసరించాల్సిన వ్యూహంపై పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.



