నవరత్నాలలో ఒకటైన సంపూర్ణ మద్యపాన నిషేధం కొరకు జగన్ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అడుగులు మొదలు పెట్టింది. మద్యం వ్యాపారం పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి తెచ్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు తాజగా మద్యం రేట్లను అమాంతం పెంచేసింది. అధిక రేట్ల వల్ల మద్య ప్రియులు తాగడం తగ్గించేస్తారని ప్రభుత్వం చెబుతున్నా తాగే వారు ఎంతైనా ఖర్చు పెట్టి తాగుతారని పలువురు అంటున్నారు.
మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పేరిట ప్రభుత్వం భారీగా పన్నులు పెంచింది. మద్యం సీసాల గరిష్ఠ చిల్లర ధరపై భారీగా పన్ను విధించింది. దీంతో మద్యం ధర మరింత ప్రియం కానుంది. మద్యం దుకాణాలు, బార్లలో ఈ పన్ను వసూళ్లు చేయనుంది. 90ఎంఎల్‌కు గరిష్ఠంగా రూ.10 పన్ను విధించనుంది. అలాగే మందు పరిమాణం పెరిగే కొద్ది పన్ను రెట్టింపు కానుంది.
గరిష్ఠంగా రూ.10 నుంచి 250 వరకు పన్ను పెరగనుంది. అయితే నిపుణులు మాత్రం ఈ చర్యల వల్ల బ్లాక్ మార్కెట్ బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ధరలు తక్కువ గా ఉండే పొరుగు రాష్ట్రాల నుండి మద్యం కొన్ని తెచ్చి ఇక్కడ అమ్మే వారి సంఖ్య పెరుగుతుందని అంటున్నారు.
అదే సమయంలో ఏపీ, తెలంగాణ బోర్డర్ లో ఉండే మందుబాబులు తెలంగాణ వెళ్ళి తాగి రావడం, అక్కడ నుండి కొని తెచ్చుకోవడం వల్ల రాష్ట్ర రెవిన్యూకు గండి పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్న రాష్ట్రానికి ఇది పెను భారంగా పరిణమించవచ్చు. ఒకరకంగా జగన్ పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు మేలు చేసినట్టే.



