అనుభవ రాహిత్యంతో జగన్ సర్కార్ పరిపాలన దారుణంగా ఉందంటూ ఉండవల్లి లాంటి ప్రముఖులు బహిరంగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విమర్శలు చేసి దాదాపుగా పది పదిహేను రోజులు సమయం ముగిసింది. ఒకప్పుడు ఇదే ఉండవల్లి వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ‘జగన్ అండ్ కో’ చేసిన ప్రచారం తెలిసిందే.
దీంతో ఉండవల్లి లాంటి పెద్దలు విమర్శలు చేయడానికి తావు లేకుండా తమ పాలనను సవరించుకుంటున్నారా? అంటే… తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అభాసుపాలు అవుతుండడం గమనించదగ్గ విషయం. మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ లలో కొత్తగా వేసే లే ఔట్లలో 5% స్థలాన్ని ‘వైఎస్సార్ జగనన్న హోసింగ్ ప్రాజెక్ట్’ కేటాయించాలని జారీ చేసిన జీవో పెట్టుబడిదారుల మీద గుదిబండలా మారుతోంది.
ఒకవేళ స్థలాన్ని కేటాయించని పక్షంలో, సదరు భూమి మొత్తం మీద 5% స్థలం యొక్క విలువను అయినా జమ చేయాలని చెప్పడం శోచనీయం. ప్రస్తుతం మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ లలో సీఆర్డీఏ లేక ఉడా అప్రూవల్స్ మేరకు 10శాతం భూమిని పార్క్ వంటి సామాజిక అవసరాలకు వినియోగించాల్సి ఉండగా, ఇపుడు వైఎస్సార్ జగనన్న హోసింగ్ ప్రాజెక్ట్ 5% అదనం.
మూడు రాజధానుల ప్రభావంతో గత రెండేళ్లుగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దారుణమైన స్థితికి వచ్చేసిందన్న విషయం రెవిన్యూ గణాంకాలు చెప్పకనే చెప్తున్నాయి. ఇక పెట్టుబడిదారుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. ఇలాంటి తరుణంలో రియల్ ఎస్టేట్ ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నుండి ఏమైనా ప్రకటనలు వస్తాయేమోనని ఎదురు చూస్తుండగా, 5% అదనంగా డబ్బును చెల్లించాలని జీవో రావడం నెత్తి పైన మరో గుదిబండలా మారిందని వాపోతున్నారు.
ఈ 5 శాతం ప్రభావం అంతిమంగా ఇది ప్రజల మీదే పడనుంది. ప్రభుత్వానికి చెల్లించే ఈ 5 శాతం డబ్బులను కూడా పెట్టుబడిదారులు భూమి విలువలో కలిపి ప్రజలకు విక్రయిస్తారు. దీంతో కాస్తో కూస్తో స్థలాన్ని సమకూర్చుకుందామని భావించే ప్రజలకు, ఆ కలను దూరం చేసే ప్రక్రియగా భావించవచ్చు. మరో దారుణమైన నిర్ణయంగా ప్రతిపక్షాలు అభివర్ణస్తుండగా, నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.



