చంద్రబాబు నాయుడుపై రాజకీయ కక్షతో అరెస్ట్ చేసి, ఇప్పుడు ఆ విషయం తనకు తెలియదని, దాంతో తనకు సంబందమే లేదని ఏపీ సిఎం జగన్ చెప్పడం, భవిష్యత్‌లో ఏవైనా న్యాయపరమైన సమస్యలు వస్తే సదరు అధికారులను బలిపశువులుగా చేసి తాను తప్పించుకోవడం కోసమేనని అర్దమవుతూనే ఉంది.
చంద్రబాబు నాయుడు మొదటి నుంచి తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, పాల్పడిన్నట్లు ఏపీ సీఐడీ అధికారులు ఒక్క సాక్ష్యం కూడా చూపలేకపోతున్నారని వాదిస్తున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్ నిన్న ఏపీ సీఐడీ విచారణకు హాజరైన తర్వాత ఆయన కూడా ఇదే చెప్పారు.
ఒకవేళ చంద్రబాబు నాయుడు తదితరులు నిజంగా అవినీతికి పాల్పడ్డారనే బలమైన సాక్ష్యాధారాలు ఏపీ సీఐడీ వద్ద ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఈ కేసులు తన మెడకు చుట్టుకోకూడదన్నట్లు మాట్లాడవలసిన అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారు కనుకనే అరెస్ట్ చేశామని ఇంతకాలం వాదిస్తున్నారు కనుక దానికే కట్టుబడి ఉండాలి కదా?కానీ చంద్రబాబు నాయుడుపై తనకు ద్వేషం, రాజకీయ కక్ష లేవని, ఈ కేసులతో తనకు సంబందమే లేదని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్పడం ముందస్తు జాగ్రత్త చర్యగానే పరిగణించాల్సి ఉంటుంది.
టిడిపి, జనసేనలు ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్పకుండా వీటన్నిటిపై విచారణ జరిపించి జగన్‌తో సహా బాధ్యులైన ప్రతీ ఒక్కరిపై చట్టప్రకారం చర్యలు తీసుకొంటామని పదేపదే హెచ్చరిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి తన చేతికి మట్టి అంటకుండా జాగ్రత్త పడుతున్నట్లు అర్దమవుతోంది.
జగన్ అక్రమాస్తుల కేసులలో పలువురు ఉన్నతాధికారులు కోర్టుల చుట్టూ తిరిగి, చివరికి జైలుకి కూడా వెళ్ళి వచ్చారు. కనుక వైసీపి ఒత్తిళ్ళకు తలొగ్గి బలమైన సాక్ష్యాధారాలు లేకుండా ఇప్పుడు అధికారులు ముందుకు సాగితే భవిష్యత్‌లో వారికీ ఇటువంటి సమస్యలే ఎదుర్కోవలసి ఉంటుంది. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కేసులతో తనకు సంబందం లేదని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పేశారు కనుక ఈ నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహించాలో అధికారులే తేల్చుకోవాలి.



