వాలంటీర్ ఐడియా కూడా బెడిసికొట్టిందే… ఇప్పుడెలా?

YS-Jagan-Grama-Ward-Volunteers-Awards

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపి ఓటు బ్యాంకును పెంచుకొని ఈసారి ఎన్నికలలో వాడుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకే జగన్మోహన్‌ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను సృష్టించారని అందరికీ తెలుసు.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన జగన్‌ ప్రభుత్వానికి వాలంటీర్ల వ్యవస్థ పెను భారమే అయినప్పటికీ, ఇంతకాలం వారికి జీతాలు చెల్లిస్తూ పార్టీ అవసరాలకు వాడుకొంటున్నారు. కానీ తీరా చేసి ఎన్నికల గంట మ్రోగిన తర్వాత వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించడంతో ఈ ఐడియా కూడా బెడిసికొట్టింది.

ADVERTISEMENT

వాలంటీర్ల వ్యవస్థను సృష్టించి చాలా గొప్ప పని చేశానని జగన్‌ జబ్బలు చరుచుకున్నారు. కానీ అదే ఇప్పుడు వైసీపికి శాపంగా మారింది. వాలంటీర్ల కారణంగా వైసీపి నేతలు, కార్యకర్తలకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు తెంచేసిన్నట్లయింది.

వాలంటీర్లతో ప్రజలకు అనుబంధం ఏర్పడటంతో వారినే నమ్ముతున్నారు. కానీ కీలకమైన ఈ ఎన్నికల వేళ జగన్‌ ప్రభుత్వం వారి సేవలను వినియోగించుకోలేకపోతోంది. ఒకవేళ వైసీపి నేతల ఒత్తిళ్ళు భరించలేక వాలంటీర్లు ఎవరైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఎన్నికల సంఘం వెంటనే వారిపై వేటు వేసేస్తోంది. కనుక ఎవరూ ముందుకు రావడం లేదు.

దీంతో జగన్‌ ప్రభుత్వం వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించి వారి సేవలు వాడుకోవాలనే మరో కొత్త ఐడియా చేసింది. కానీ ఎవరూ రాజీనామాలకు ఇష్టపడటం లేదు!

వైసీపి మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో తెలీని పరిస్థితి. వస్తే ఎలాగూ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారు. టిడిపి, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసే అవకాశం ఉంది. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని అనుకుంటే, ఇప్పుడు వైసీపి కోసం రాజీనామాలు చేసి బయటకు వెళ్ళిపోయిన వారిని తిరిగి తీసుకుంటుందనే నమ్మకం లేదు.

కనుక ఇప్పుడు వైసీపి కోసం రాజీనామాలు చేసి, దాని కోసం ఎండల్లో పడి తిరిగే బదులు రాజీనామాలు చేయకుండా ఇంట్లో కూర్చున్నా చివరి ఈ రెండు నెలల జీతమైన వస్తుందనే ఆలోచనతో వాలంటీర్లు ఎవరూ రాజీనామాలు చేయడం లేదని తెలుస్తోంది.

సుమారు 2.5 లక్షల మందిలో కేవలం 10-12 వేలమంది మాత్రమే రాజీనామాలు చేశారు. ఈ విషయం జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి వచ్చింది. అందుకే నిన్న సభలో “నేను మళ్ళీ ముఖ్యమంత్రికాగానే మొట్ట మొదట వాలంటీర్ల ఫైలుపైనే తొలి సంతకం చేస్తాను. ఎట్టి పరిస్థితులలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను,” ప్రకటించాల్సి వచ్చింది.

అయినప్పటికీ ఎవరూ రాజీనామాలు చేయడానికి ఇష్టపడటం లేదు. జగన్‌ స్వయంగా భరోసా ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న ఉద్యోగాలకు రాజీనాలు చేసి తర్వాత మళ్ళీ వాటి కోసం అవస్థలు పడే బదులు ఉద్యోగంలోనే ఉంటేనే మంచిది కదా?అని అనుకుంటున్నారు.

పైగా ఎన్నికల సంఘం పుణ్యమాని ఇప్పుడు సంక్షేమ పధకాల కోసం ఇప్పుడు ఇంటింటికీ తిరిగే పని కూడా లేదు. ఇన్నేళ్ళు ఎలాగూ వైసీపికి ఎలాగూ వెట్టి చాకిరీ చేశాము కనుక మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో తెలీని వైసీపి కోసం ఉన్న ఉద్యోగాలను వదులుకోవడం కంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఈ రెండు నెలలు ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకోవడమే మంచిదని చాలా మంది వాలంటీర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

‘ఈ ఎన్నికలలో వాలంటీర్లే నా సైన్యం… వాలంటీర్లే గేమ్ చేంజర్‌’ అని జగన్మోహన్‌ రెడ్డి గొప్పగా చెప్పుకుంటే చివరికి ఈ ఐడియా కూడా ఇలా బెడిసికొట్టింది. దేవుడి స్క్రిప్ట్ ఇలా మారిపోతోందేమిటో?

ADVERTISEMENT
Latest Stories