ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ లో ల్యాండ్ అయ్యారు. లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తన కూతురు విద్య నిమిత్తం వెళ్ళాల్సి ఉందని సీబీఐ కోర్టు నుండి అనుమతి తీసుకున్న జగన్, ఆ పనులను పూర్తి చేసే పనిలో భాగంగా లండన్ చేరుకున్నారు. ఏపీలో ఉన్నంత సేపు చంద్రబాబు నాయుడుపై మండిపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసే జగన్, లండన్ లో మాత్రం ఖుషీ ఖుషీగా కనపడుతున్నారు.
ఇటీవల నంద్యాల మరియు కాకినాడ ఎన్నికలలో జరిగిన పరాభవాన్ని మరిచిపోవడానికి ఈ లండన్ పర్యటన బాగా ఉపయోగపడేటట్లు కనపడుతోంది. ఏపీ రాజకీయాలకు దూరంగా కాస్తంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసే విధంగా జగన్ కనపడుతున్నారు. గతంలో ఇలా విదేశీ పర్యటనలు చేసిన సందర్భాలలో… గోల్ఫ్ ఆడుతూ మరియు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
ముందుగా లండన్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ కు స్థానిక వైసీపీ నేతలు మరియు కార్యకర్తల నుండి శుభాభినందనలు లభించాయి. గతంలో చంద్రబాబు విదేశీ పర్యటనలు చేసినప్పుడల్లా… ఏపీ డబ్బంతా తీసుకుపోతున్నారని ఆరోపణలు చేసే జగన్ మరియు వైసీపీ అండ్ కోకు, తెలుగుదేశం నేతల నుండి కౌంటర్స్ రాకపోవడం విశేషం. జగన్ పర్యటనపై ఎలాంటి ఆరోపణలు వస్తాయో, వాటికి జగన్ అండ్ కో ఎలా వివరణ ఇచ్చుకుంటారో చూడాలి.


