మంగళవారం ఉదయం అమరావతిలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… అధినేత చంద్రబాబు నాయుడుకు స్వయంగా ఫోన్ చేశారు. తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఇప్పటికే పలువురు నేతలకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానం పలుకుతున్న జగన్.. ఇవాళ చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఈనెల 30న జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.
అలాగే రాష్ట్రాభివృద్ధికి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని జగన్ ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా అపూర్వ విజయం సాధించిన జగన్ ను మాజీ ముఖ్యమంత్రి అభినందించారు. ప్రభుత్వం చేసే మంచి పనులు అన్నిటికీ బాధ్యతాయుత ప్రతిపక్షంగా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే సహజంగా అటువంటి కార్యక్రమంలో అభిమానులలో ఉండే అత్యుత్సాహం వల్ల చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉండకపోవచ్చు అని తెలుస్తుంది.
అయితే తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న వైఎస్ జగన్ స్వయంగా చంద్రబాబును ఆహ్వానించి మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈనెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈకార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.



