అత్యవసరంగా బంధువులు కావలెను!

YS Jagan Meets Relatives in Pulivendula

అవును. వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి తమని ఆస్తుల పంపకాలలో మోసం చేశాడని తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల బహిరంగ లేఖలు వ్రాయడంతో అత్యవసరంగా తనకు అండగా నిలబడే బంధువుల కోసం వెతుక్కొంటున్నారని గిట్టనివారు చెవులు కోరుకొంటున్నారు.

ADVERTISEMENT

జగన్‌ బంధుప్రీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గొడ్డలి పోట్లు తట్టుకోలేక గుండెపోటుతో మరణించినందుకు జగన్‌,అవినాష్ రెడ్డి ఎంతగా బాధపడ్డారో అందరికీ తెలుసు.

ఆ బాధ భరించలేక లోలోన కుమిలిపోతుంటే వివేకా కుమార్తె సునీతా రెడ్డితో కలిసి షర్మిల కూడా పసిపిల్లవాడైన అవినాష్ రెడ్డిని, ఆ పిల్లాడిని వెనకేసుకు వస్తున్నందుకు జగనన్నని వేలెత్తి చూపుతూ నిందిస్తుంటే వారు ఎంతగా కుమిలిపోయారో ఎవరికీ తెలియదు.

ఓ పక్క అక్రమస్తుల కేసులు నెత్తి మీద కత్తులా వ్రేలాడుతుంటే, మరోపక్క వివేకా హత్య కేసు కూడా తమ మెడకే చుట్టేసేందుకు గిట్టనివారు అందరూ కలిసి కుట్రలు పన్నుతున్నారని జగన్‌ ఆవేదన చెందుతున్నారు.

అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా సవ్యసాచిలా అన్ని కేసులలో ఒకేసారి న్యాయపోరాటాలు చేస్తూ ఏదీ కొలిక్కిరాకుండా అడ్డుకోగలుగుతున్నారు.

చెల్లి రాఖీ కడితే రూ.200 కోట్లు బహుమతి ఇచ్చిన ఏకైక అన్న జగన్‌ మాత్రమే. కానీ ఆ అన్న విలువ గుర్తించకుండా 200 కోట్లు కొసరు మాత్రమే అసలు (వేలో.. లక్షల కోట్లో) ఎప్పుడిస్తావంటూ అలిగి తెలంగాణకు వెళ్ళిపోయింది చెల్లి షర్మిల.

కానీ మళ్ళీ గోడకు కొట్టిన బంతిలా ఏపీకి తిరిగి వచ్చి దుష్టులు, దుర్మార్గుల చెప్పుడు మాటలు విని 5 ఏళ్ళలో ఆకాశమంత ఎత్తున పేరుకుపోయిన తన ప్రతిష్టని దెబ్బ తీస్తోందని జగన్‌ ఎంతగానో బాధ పడుతున్నారు.

నీతి, న్యాయం ధర్మం తప్ప కోపమే ఎరుగని ధర్మరాజు లాంటి జగన్‌కి సహనం నశించి ఇలాంటి తల్లి, చెల్లి పగవాడికి కూడా ఉండొద్దనుకుని ఆస్తిలో వాటాలు గీటాలు ఇవ్వనని తెగేసి చెప్పేశారు.

అప్పటి నుంచే షర్మిల చెల్లి నిజరూపమో లేదా విశ్వరూపమో ప్రదర్శిస్తూ, రాష్ట్రంలో ఆడపడుచులందరికీ సొంత అక్కచెల్లెమ్మలుగా భావించే విశాల హృదయం గల జగనన్న సున్నితమైన మనసుని తూట్లుతూట్లు పొడిచేస్తోంది.

పోనీ… చెల్లికి దురాశ ఎక్కువని సరిపెట్టుకున్నా తల్లి విజయమ్మకి ఏమైంది?‘వాస్తవాలు చూడకుండా గాంధారిలా ప్రవర్తిస్తూ కూతురిని వెనకేసుకు వస్తూ దుర్యోధనుడు వంటి జగన్‌పై విరుచుకుపడుతున్నారు?’ అంటూ జగన్‌ మనసాక్షి కోప్పడింది కూడా.

తల్లి, చెల్లి, మరో చెల్లి సునీతా రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, ఇంకా పైనుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఆత్మలు అందరూ తనని ‘బ్యాడ్ బాయ్’ అంటున్నారని అనుమానం కలిగిందో ఏమో… బంధువుల జాబితా బయటకు తీసి తనకు అండగా ఎవరైనా నిలబడతారేమో అని చూస్తున్నారని గిట్టనివారు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ జగన్‌ బంధుప్రీతి గురించి తెలిసినవారు ఎవరైనా ఆయన కోసం ముందుకు వస్తారా? ఏమో చూద్దాం!

ADVERTISEMENT
Latest Stories